Sunday, January 19, 2025

తెలంగాణపై కేంద్రం వివక్ష…

- Advertisement -
- Advertisement -

Minister KTR Fires on Modi and Kishan Reddy

ప్రధాని మోడీ, కిషన్ రెడ్డిలపై కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కారు వివక్షను చూపిస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ప్రాజెక్టులను తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను గుజరాత్ లో ప్రారంభమైన సందర్భంగా మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీని ఏర్పాటుకు సంబంధించి భూమిని కేటాయించడానికి చర్యలు కూడా తీసుకుంది. కానీ చివరకు అది బిజెపి పాలిత గుజరాత్ కు తరలిపోయింది. మంగళవారం నాడు గుజరాత్లోని జామ్నగర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

గతంలో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ ను షేరు చేసిన కేటీఆర్.. ‘తెలంగాణపై మోడీ జీ వివక్ష కథ నిరంతరం కొనసాగుతోంది‘ అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేంద్రం.. 7 ఐఐఎంలు, 7 ఐఐటిలు, 2 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, 16 ఐఐఐటీలు, 4 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, 157 వైద్య కళాశాలలు, 84 నవోదయ విద్యాలయాలు కేటాయించినా ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని కెటిఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. అంతకు ముందు కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కెటిఆర్. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) చట్టానికి అతీతంగా ఉందా? అంటూ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని విశ్వహిందూ పరిషత్ బెదిరించినట్లు వచ్చిన రిపోర్టులు నేపథ్యంలోనే మంత్రి కెటిఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులపై ఈ విపరీతమైన ధోరణిని సహిస్తారా? అని అమిత్ షాను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News