Monday, December 23, 2024

రాష్ట్రాలకు గుజరాత్ గుండు

- Advertisement -
- Advertisement -

దేశంలో నడుస్తున్నది మోడెమొక్రసీ

ఆఫ్ గుజరాత్.. బై గుజరాత్.. గుజరాత్

గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్

మోడీ దేశానికి ప్రధాని అయినా గుజరాత్ సిఎం తరహాలోనే పనిచేస్తున్నారు
వరంగల్‌లో కోచ్ హామీని మరిచిపోయి గుజరాత్‌లో ఎలా ఏర్పాటు
చేస్తారు? వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోగా
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోందని మరోసారి రుజువైంది రాష్ట్రానికి
వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రాన్ని కూడా గుజరాత్‌కే తీసుకుపోయారు ఏడు
ఐఐఎంలు, ఏడు ఐఐటిలు తెలంగాణకు ఒక్కటీ లేదు
ఏఐఐఎస్‌ఇఆర్‌లలోనూ రాష్ట్రానికి గుండు సున్నాయే మెడికల్ కాలేజీలు,
నవోదయ విద్యాలయాల కేటాయింపుల్లోనూ అన్యాయమే

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్‌పై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకపడ్డారు. గుజరాత్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. ఆ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఉద్దేశించి ‘మోడెమోక్రసీ’ అంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు. బిజెపి పాలనలో దేశంలో డెమోక్రసీ అసలు లేదన్న విషయం మరోసారి తేట తెల్లం అయిందని పేర్కొన్నారు. దేశానికి ప్రధాన మంత్రి అయినా గుజరాత్ ముఖ్యమంత్రి తరహాలో రాష్ట్రం కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మిగతా రాష్ట్రాల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని విస్మరించిన మోడీ ఎలా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని నిలదీశారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం చర్య సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్రంపై కేంద్రం వివక్ష విడనాడాలని కెటిఆర్ చురకలు అంటించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వేకోచ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఎనిమిదేళ్లు అవుతున్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాకపోగా, గుజరాత్‌కు మాత్రం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం కూడా యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందని మండిపడ్డారు.

అలాగే కేంద్రం ఏడు ఐఐఎంలు, మరో ఏడు ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాంచలేదన్నారు. ఐఐఎస్‌ఇఆర్‌లు రెండు కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏమీ రాలేదన్నారు. ఇక కేంద్రం పదహారు ఐఐటిల్లో మంజూరు చేస్తే…అందులో కూడా ఒక్కడి తెలంగాణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఐడిలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ రాష్ట్రానికి సున్నానే అని, 84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని కెటిఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే. అలాగే గిరిజన యూనివర్సిటీ హామీని కూడా కేంద్రం విస్మరించిందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు.

ధోనీ ఒక అసాధారణ ఫినిషర్

మహేంద్రసింగ్ ధోనిపై మంత్రి కెటిఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. అతనో అసాధారణ ఫినిషనర్. చాంపియన్ క్రికెటరని కొనియాడారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోని తన ఫినిషింగ్ టచ్‌తో ఐపిఎల్‌కు సరికొత్త కిక్ తెచ్చాడని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా చైన్నై జట్టుకు చివరి ఓవర్‌లో అవసరమైన నాలుగు బంతుల్లో 16 పరుగులను సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు. ఈ విజయంలో ధోనీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని అన్నారు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ధోని ఆడిన ఆటను చూస్తుంటే, ఆయనకు వయస్సు పెరిగినా పవర్ గేమ్‌లో ఎటువంటి ట్యాలెంట్ తగ్గలేదని చాలా స్పష్టంగా కనిపించిందని శుక్రవారం ట్విట్టర్ వేదిక ద్వారా కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతిభావంతునికి వయస్సు ఏ మాత్రం అడ్డురాదన్న విషయాన్ని ధోనీ ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. రోజురోజుకు ఈ లెజండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నట్లు కనపడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. అందుకే కోట్లాది మంది ప్రజలకు ఆయన ఆరాధ్య క్రికెటర్‌గా మారారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News