6311 వాహనాలకు రూ.26 కోట్ల పన్ను రాయితీ
గ్రేటర్‌లో మహిళలకు 500 ఎలక్ట్రిక్ ఆటోలు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం శాసనమండలిలో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల విధానంపై సభ్యుడు నవీన్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2020 అక్టోబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విధానం ప్రవేశం పెట్టామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, భాగాల తయారీ పెట్టుబడులను పెంపొందించడం.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నవీనకరణ ప్రోత్సహిస్తున్నాం. మూలధన పెట్టుబడి రాయితీ, ఎస్‌జిఎస్‌టి రీయింబర్స్‌మెంట్, విద్యుత్, వడ్డీ రాయితీ, నిర్దేశిత వాహనాలకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చాం.
ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాం. మెరుగైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు ఇచ్చాం. సంప్రదాయ ఇంధన వనరుల పెంపునకు ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్రంలో రెండు పారిశ్రామిక క్లస్టర్‌లు ఏర్పాటు చేశాం.చేవెళ్ల నియోజకవర్గంలోని చందన్‌వెళ్లి, సీతారాంపురంలో 1300 ఎకరాలు, మహబుబ్‌నగర్‌లోని దివిటిపల్లిలో 340 ఎకరాలు, జహీరాబాద్ నిమ్జ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ల తయారీకి భూమి కేటాయించాం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రూ.5600 కోట్ల వివిధ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 8వేల మందికి ఉపాధి కల్పించగా.. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో విదేశీ, దేశీయ కంపెనీలతో పాటు రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించే లిథియం బ్యాటరీల తయారీకి వినియోగించే ముడి సరకులు చైనాలోనే 80 శాతం ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్టా మైనింగ్ శాఖ అధికారులను విదేశాలకు పంపించి లిథియం తయారీకి వీలుగా అక్కడి నుంచి ముడి సరకును దిగుమతి చేసుకునేలా కార్యచరణ చేస్తున్నాం.
రాష్ట్రంలో 6311 ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.26 కోట్లు పన్ను మినహాయింపు..
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ విధానం అమలు చేశాక.. ఇప్పటి వరకు 6311 వాహనాలు విక్రయించారు. ఇందుకు రవాణాశాఖ నుంచి రూ.26 కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చాం. నగరంలో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు 98 ఉన్నాయి. హైదరాబాద్‌లో 118 ఛార్జింగ్ కేంద్రాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలో 12 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో 600 కేంద్రాలను పీపీపీ విధానం ఏర్పాటు చేయనున్నారు. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నాం. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 ఎలక్ట్రిక్ ఆటోలను మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు అందజేయనున్నాం. వాతావరణ సమస్యలు, భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఎలక్ట్రిక్ విధానానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాలు అందజేస్తుంది. రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీకి మహేంద్ర కంపెనీ ముందుకొచ్చిందని, అందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.