మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగు తీయనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కెటిరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ ప్రయాణికులను చేరవయనుంది. ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముందుగా ఆరు డబుల్ డెక్కర్ బస్సులు…
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం హయాంలో మొదలైన ఈ సంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. ట్విట్టర్‌లో ఒక పౌరుడి అభ్యర్థన మేరకు, ఆ బస్సుల్లో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను మంత్రి కెటిఆర్ గతంలో గుర్తుచేసుకున్నారు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను మంగళవారం కెటిఆర్ ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు త్వరలో వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరో 20 బస్సులకు విస్తరించాలని హెచ్‌ఎండిఏ యోచిస్తోంది. ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల16 లక్షల రూపాయలు కాగా, ఏడు సంవత్సరాల పాటు ఏఎంసి కొనసాగుతుంది. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడుస్తాయి. ఒకే ఛార్జ్‌లో 150 కిమీల దూరం ఈ బస్సులు ప్రయాణిస్తాయి. రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తిగా ఛార్జీంగ్ అవుతాయి.
నీలం రంగులో ఆకర్షించే విధంగా…
ఈ బస్సులు నీలం రంగులో ప్రయాణికులను ఆకర్శించే విధంగా ఉన్నాయి. కింది భాగంతో పాటు పైన కూడా అదనంగా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. పెద్ద అద్దాలతో ఎంతో అందంగా ఉన్న ఈ బస్సులు విదేశాల్లో తిరిగే బస్సుల మాదిరిగా ఉన్నాయి. అయితే కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. నగరంలో ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్న ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు జర్నీతో పాటు హైదరాబాద్ అందాలను ఆస్వాదించేలా బస్సులకు ఓపెన్ టాప్ ఇచ్చారు. ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తున్నాయన్న వివరాలు ప్రదర్శించేలా పెద్దగా దీనికి డిస్‌ప్లేను ఏర్పాటు చేయడం విశేషం.
మంత్రి పువ్వాడ సంతోషం…
ఈ బస్సులు హైదరాబాద్‌కు చేరుకున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నగరవాసులతో సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ మేరకు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయని ఇక నుంచి ఈ బస్సులు నగర రహదారులపై పరుగులు తీయనున్నాయని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఇక ఈ బస్సుల ఫొటోలు చూసిన నెటిజన్లు తెగ లైక్‌లు చేస్తున్నారు.