జగిత్యాల: రాష్ట్ర, ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్మించిన 110 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనమందరం టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండడం గర్వ కారణం. టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించారు. తెచ్చుకున్న తెలంగాణను అతి తక్కువ కాలంలో తలెత్తుకునేల చేశారు. అన్ని రంగాల్లో నేడు దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణగా ఉంది. తెలంగాణలోని అభివృధి చూసి పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ ప్రజలు తెలంగాణలో కలపండి అని అడుగుతున్నారని వేముల తెలిపారు. కర్నాటక ఎమ్మెల్యేనే స్వయంగా అడిగారని చెప్పారు. దేశంలో టాప్ 10 ఆదర్శ గ్రామాలు తెలంగాణ లోనే ఉన్నాయి.
బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని గ్రామాలు ఎందుకు లేవుని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి,బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుక్కల్లగా మొరుగుతున్నారని ఫైర్ అయ్యారు. కెటిఆర్ మున్సిపల్,ఐటి శాఖ మంత్రిగా రాష్ట్రానికి వేల పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలోనే 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కెటిఆర్ కే దక్కుతుందన్నారు. ఐటి ఎగుమతులు 2014లో 57 వేల కోట్లు ఉంటే నేడు అవి 2లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐటి లో ఉద్యోగాలు 3 లక్షలు ఉంటే నేడు 7లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి. హైదరాబాద్ పట్టణంతో పోటీగా పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నా నియోజకవర్గం లోని భీంగల్ ను కొత్తగా మున్సిపాలిటీ చేసి,పట్టణాన్ని సుందరంగా చేసుకునేందుకు మున్సిపల్ మంత్రిగా కెటిఆర్ గారు 25 కోట్లు ఇచ్చారు. మెట్ట చిట్టాపూర్ లో విత్తన కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. నేడు ఎమ్ఓయు చేసుకున్నాయి.
ఇందులో స్థానికులకే 2వేల 200 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. తెలంగాణలోని మారు మూల పల్లెకు పరిశ్రమలు తెచ్చిన ఘనత కెటిఆర్ దే, స్వయంగా కంపెనీ వారే చెప్తున్నారు. కెటిఆర్ ప్రోత్సాహం, ఇచ్చిన దైర్యం వల్లే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నామన్నారు. బండి సంజయ్,రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తిరుగుతున్నారు కదా..హైదరాబాద్ లో అభివృద్ది మీ కళ్లకు కన్పిస్తలేదా..? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ కార్యకర్తలు.. బీజేపీ,కాంగ్రెస్ నాయకుల అబద్ధపు ప్రచారాలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్షఅని ఆయన పేర్కొన్నారు.