Monday, December 23, 2024

శ్రీకాంతాచారి చౌరస్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని, త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను ప్రారంభించిన ఈ ప్లై ఓవర్‌కు ‘మాల్ మైసమ్మ’ అని నామకరణం చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలోని ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను శనివారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సిగ్నల్ ఫ్రీ కావడంతో వాహనదారులకు ఊరట ఇవ్వనుంది.

700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం రూ.32 కోట్లను ఖర్చు చేశారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్‌తో పాటు భూసేకరణ ఖర్చులతో కలుపుకొని మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఎపి, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు నగర వాసులకు హయత్‌నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేందుకు ఇది ఎంతగానో దోహద పడనుంది.
జీహెచ్‌ఎంసీ నిధులతో 32 పనులు పూర్తి
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ‘ఎల్బీనగర్- టు నాగోల్’కు మెట్రో అనుసంధానిస్తామన్నారు. ఎన్నికల తరువాత హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరించడం సహా ఎయిర్‌పోర్టుకు అనుసంధానిస్తామని ఆయన తెలిపారు. ఎల్బీ నియోజకవర్గంలో చేపట్టిన 12 ప్రాజెక్టుల పనులకు రూ.658 కోట్లను ఖర్చు చేశామని అందులో ఇప్పటికే 9 పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మిగతా మూడు ఫ్లై ఓవర్లను సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు నగరంలో అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాసింగ్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎస్‌ఆర్‌డిపి ద్వారా 47 పనులు ప్రారంభించామన్నారు.

ఇందులో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ నిధులతో 32 పనులు పూర్తయ్యాయని, మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో మూడు పూర్తి కాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో ఉన్నాయన్నారు.అలాగే ఏడాదిన్నరలో కొత్తపేటలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామని, సంవత్సన్నర కాలంలో దీనిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. జీఓ 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లోని పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నామని కెటిఆర్ చెప్పుకొచ్చారు. జీఓ నంబర్ 118 కింద దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో పరిష్కరించుకున్నామని, ఈ నెలఖారు వరకు వాటికి పట్టాలు అందించి, ఆ బాధ నుంచి విముక్తి చేస్తామని మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News