Friday, November 22, 2024

మార్గదర్శకంగా ప్లీనరీ

- Advertisement -
- Advertisement -
Minister KTR Inspects TRS Plenary Meeting Works
దేశానికి దిశానిర్దేశకంగా పార్టీ శ్రేణులకు గుర్తుండిపోయేలా
25న పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తాం హైటెక్స్‌లో
ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన తలపెట్టిన టిఆర్‌ఎస్ ప్లానరీ సమావేశాన్ని దేశానికి దిశానిర్దేశం ఇచ్చేలా నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అత్యంక కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. కేంద్రం కూడా తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకుని పలు నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం తీసుకునే ప్రతి నిర్ణయం దేశానికి రోల్‌మోడల్‌గా మారనుందన్నారు. ఆ దిశగా పార్టీ ప్లీనరీ సమావేశంలో అనేక సామాజిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను గురువారం హైటెక్స్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలు, మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25వ తేదీన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ అనంతరం ప్లీనరీ సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు, అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నారు. సుమారు 14 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా పాసులు మంజూరు చేస్తామన్నారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తారని ఆయన వెల్లడించారు. పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి అపూర్వమైన విధానాలు… వినూత్నమైన పాలసీలతో దేశానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం పిఎం కిసాన్‌ను ప్రారంభించిందన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి నల్లా నీళ్లిచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమం మాదిరే కేంద్రం జల్ జీవన్ మిషన్‌ను అమలు చేస్తోందన్నారు. టిఎస్ ఐపాస్ నుంచి స్ఫూర్తి పొంది కేంద్రం ’ఇన్వెస్ట్ ఇండియా’ను తీసుకొచ్చారన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేదన్నారు. ప్రస్తుతం అది నేడు తెలంగాణ ఏం చేస్తుందో… రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందన్నారు.ఇంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తలపెట్టిన ప్లీనరీ ఇతర రాజకీయ పార్టీలకు దిక్సూచిగా ఉండేలా నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా అనేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పాసులు ఉంటేనే..

ప్లీనరీ సమావేశం కోసం ప్రజాప్రతినిధులకు పాసులు మంజూరు చేస్తామన్నారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని కెటిఆర్ వెల్లడించారు.
సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి సరిహద్దులోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన బిజెపి శాసనసభ్యులు కూడా ఉండడం విశేషమన్నారు.
పలు కమిటీల ఏర్పాటు
ప్లీనరీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
ఆహ్వాన కమిటీ- : మంత్రి సబితా ఇంద్రారెడ్డి(అధ్యక్షతన), ఎంపి రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌ఎ అరికపూడి గాంధీ, మేయర్ విజయలక్ష్మి
సభా ప్రాంగణ కమిటీ : పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గ్యాదరి బాలమల్లు(అధ్యక్షతన), పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ గోపినాథ్, ఎంఎల్‌సి నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
వాలంటీర్స్ కమిటీ : ఎంఎల్‌సి శంభీపూర్ రాజు (అధ్యక్షతన)- యువజన విభాగం మొత్తం ఈ కమిటీలో ఉంటుంది
వాహనాల పార్కింగ్ కమిటీ: ఎంఎల్‌ఎ కెపి వివేకానంద, పార్టీ సీనియర్ నాయకుడు బండి రమేశ్
భోజన ఏర్పాట్ల కమిటీ: ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు
తీర్మానాల కమిటీ : మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి(అధ్యక్షతన), పార్టీ సీనియర్ నాయకుడు పర్యాద కృష్ణమూర్తి
మీడియా కమిటీ: ఎంఎల్‌సి భానుప్రసాద్, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్
నగర అలంకరణ, హోర్డింగ్స్ ఏర్పాట్లు: మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీల నేతృత్వంలో ఏర్పాట్లు జరగనున్నాయని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News