Saturday, November 16, 2024

పవర్‌తోనే పరిశ్రమలు పరుగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : స్వరాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడడంతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆ ర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంత్రి కెటిఆర్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్తలు గత తొమ్మిదేళ్ల పాలనను చూసి ఎన్నికల్లో తమకు మద్ద తు ఇవ్వాలని కోరారు. పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తమకు ఎన్నికలొస్తే అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలన గురించి ఆలోచించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలన ఎలా ఉంటుందో అని కెసిఆర్‌పై, తమ పార్టీపై ఎంతో మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తమకు పరిపాలన రాదు అని, రాష్ట్రం లో కరెంట్ ఉండదు అని, ఆంధ్ర వాళ్లను వెళ్లగొడతారు అని,

గొడవలు జరుగుతాయని…. భూముల విలువ పడిపోతుంది అని కొంత మంది అనుమానాలు, అపోహలు వ్యక్తం చేశారని చెప్పారు. కానీ అందరి అనుమానాలను, అపోహలను పటాపంచలు చేస్తూ సిఎం కెసిఆర్ అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. ఆనాడు తెలంగాణలో పవర్ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు. అప్పడు 10 రోజులు కరెంట్ లేకపోతే సర్దుకుపోయినవారు ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే తట్టుకోలేపోతున్నారని అన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలంగాణకు వచ్చిన కర్నాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారని, ఆయన మాటలతో ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో ఐదు గంటల కరెంట్ ఇస్తామంటున్నారని నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పటివరకు చూసింది ట్రైలరే…
తొమ్మిదిన్నర ఏళ్లలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని కెటిఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలు రక్షిత తాగునీరు సదుపాయం కల్పించేందుకు హామీ ఇచ్చారు. 2014కు ముందు నగర శివారు కాలనీలకు 14 రోజులకు ఒక్కసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు రోజు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తమ ఆలోచనలు ఇంకా ఉన్నాయని, ప్రజలకు 24 గంటలు మంచినీళ్లు ఇవ్వాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి వివరించారు. 2014కు ముందు భూములు ధరలు ఎలా ఉన్నా యి, ఇప్పుడు ఎలా ఉన్నాయని అడిగారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పరిశ్రమల వస్తున్నాయంటే స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లేనని పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం..సమర్థనాయకుడు ముఖ్యమంత్రిగా లేకపోతే ముందుగా దెబ్బ తినేది పరిశ్రమలే అని చెప్పారు.

ఇతర పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లి వారి పార్టీ పెద్దల పర్మిషన్ తీసుకుని, వాళ్ళని ఒప్పించాలని అన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం అందించిందని చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి అన్ని విషయాలను సమగ్రంగా చర్చించి అనుమతులకు సంబంధించి టిఎస్ ఐపాస్ తీసుకువచ్చామని గుర్తు చేశారు. పరిశ్రమలకు టైం బౌండ్ పర్మిషన్స్ ఇస్తున్నారా అని ఆనాడు సిఎం కెసిఆర్ అధికారులను అడిగితే సరైన సమాధానం రాలేదని కెటిఆర్ చెప్పారు. రెండు రోజులు పాటు పవర్ హాలిడే ఉంటే రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు ఎలా బ్రతుకుతారు అని అన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొలినాళ్లలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. .అందుకే ముందుగా కరెంట్ సమస్యను తీర్చడంపై దృష్టి సారించారని వివరించి విద్యుత్ సమస్య లేకుండా చేశారని అన్నారు.

కెసిఆర్‌ను తిడితే నాలుగు ఓట్లు వస్తాయనే అర్థపర్థం లేని విమర్శలు…
రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించామని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తమపై ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయని, కానీ తమ ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చి ఇరిగేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, హెల్త్, పవర్, ఎడ్యుకేషన్ వంటి ఉత్పాదక రంగాలలో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. ఏదో ఒకరకంగా కెసిఆర్‌ను తిడితే నాలుగు ఓట్లు వస్తాయనే తమపై అర్థపర్థం లేని విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. తాము ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి, నిబంధనలకు అనుగుణంగా అప్పులు తీసుకువచ్చామని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అప్పులు తీసుకువచ్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రధాని చేయని అప్పులు మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం చేసిందని విమర్శించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అప్పులు చేయవచ్చని, వాళ్లు అప్పులు చేస్తే ఒప్పు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పవుతుందా..? అని ప్రశ్నించారు.

కవితను అరెస్ట్ చేయకపోతే మేం బీ టీం అవుతామా..?
లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయడం లేదని, అందు కే తాము బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ నేతుల ఆరోపణలు చేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కూడా ఇడి విచారణను ఎదుర్కొంటున్నారని, వారిని ఎందుకు అరెస్టు చేయడం లేద ని… వారు కూడా బిజెపికి వత్తాసు పలుకుతున్నారా…? అని ప్రశ్నించారు. దిక్కుమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నమ్మాలో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ మూడోసారి గెలిస్తే ఇతర రాష్ట్రాలలో బలపడతారని కాంగ్రెస్, బిజెపి పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2004 ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో, 2009 ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకున్నామని, 2014,2018 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేశామని చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏ ఎన్నికల్లోనూ, కనీసం స్థానిక సంస్థల్లో కూడా బిజెపితో కలిసి పనిచేయలేదని, అలాంటప్పుడు తాము బిజెపికి బీం ఎలా అవుతామని నిలదీశారు. తాము ఎవరికీ బీ టీం కాదు అని…తెలంగాణ ప్రజలకు ఏ టీం అని స్పష్టం చేశారు.

పాత కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి
కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీలకు కూడా రాయితీలు ఇవ్వాలని మంత్రి కెటిఆర్‌ను పలువురు పారిశ్రామిక వేత్తలు కోరారు. మళ్లీ బిఆర్‌ఎస్ రావాలి.. తరువాత మన డిమాండ్స్ నెరవేర్చుకోవాలని పేర్కొన్నారు. గతంలో ఇండస్ట్రీ నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, కానీ, ప్రత్యేక రాష్ట్రం తరువాత పరిస్థితులు మారాయని చెప్పారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే మళ్లీ బిఆర్‌ఎస్ గెలవాలని వ్యాఖ్యానించారు. విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి సాధ్యమైందని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News