హైదరాబాద్: ఐటి రంగంలో 8 ఏళ్లలో అద్భుత పురోగతి సాధించామని ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా క్యాంపస్‌లో ఐటి వార్షిక నివేదిక 2021-22ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… కరోనా ఉన్న గతేడాది అంచనాలకు మించి రాణించామన్నారు. ఐటి, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది26.14 శాతం వృద్ధి సాధించామని కెటిఆర్ పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ సాధించామని తెలిపారు. 2021-2022లో ఐటి ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లు అని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా 1,49,506 ఐటి ఉద్యోగాలు,23.78 శాతం వృద్ధి రేటు నమోదైైందని చెప్పారు. దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హదరాబాద్ లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 7,78,121 ఐటి ఉద్యోగల ఉన్నారని చెప్పారు. తెలంగాణలో 8 ఏళ్లలో 4.1లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టిహబ్ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్ చెప్పారు. టి వర్క్ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచన ఉందన్నారు.