మన తెలంగాణ/హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ విధానం కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి దేశానికే ఆదర్శవంతమైన పాలిసీని రూపొందిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అనేవి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలుగా ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఇవాంటి సంస్థ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులలో హైదరాబాద్ ఒకటిగా నిలవడం తమకు గర్వంగా ఉందన్నారు. అలాంటి వాటిల్లో ఇవాంటి సంస్థ కూడా ఒకటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరం ప్రముఖ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా ఉందన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఇవాంటి సంస్థ సైబల్ సెక్యూరిటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటి, సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఇవాంటి హైదరాబాద్‌లో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో ఒక ఆవిష్కరణ కేంద్రంతో పాటు ఉద్యోగుల సంఖ్యను 2 వేలకు పెంచనున్నట్లు ఇవాంటి సంస్థ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. అదేవిధంగా సైబ ర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కెటిఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో మూడు రెట్లు వృద్ధిని సాధించడమే కంపెనీ లక్షంగా పెట్టుకుందన్నారు. ప్రపంచ మార్కెట్ కోసం రాష్ట్ర ఇంజనీర్లు, ఐటి ప్రొడక్ట్‌లు, సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.
అనంతరం ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వేగాన్ని కొవిడ్ మహమ్మారి వేగవంతం చేసిందన్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది సై బర్ ముప్పు ద్వారా స్వీయ సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. క్రమంలో భద్రతతో నిండిన, సురక్షితమైన వ్యాపార వాతావరణాన్ని సృ ష్టించడానికి ఇవాంటి వంటి కంపెనీలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు, సిఇఓ, సైబర్ సె క్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాక్టర్ రామ మొవ్వ, సైబర్ సెక్యూరిటీ వర్క్ చైర్మన్ అండ్ కో-ఫౌండర్‌లతో పాటు ఇవాంటికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు నాయకి నయ్యర్ ప్రెసిడెంట్, సర్వీస్ మేనేజ్‌మెంట్ సాల్యూషన్స్ గ్రూప్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, శ్రీనివాస్ ముక్కామల, సెక్యూరిటీ ప్రొడక్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లు హాజరయ్యారు.