Monday, December 23, 2024

నొప్పి భరిస్తూ.. నాలుగు గంటలు

- Advertisement -
- Advertisement -

Minister KTR left leg injured

మహీంద్రా వర్శిటీ స్నాతకోత్సవానికి బయల్దేరేముందు ప్రగతిభవన్‌లో కాలుజారి
గాయపడిన కెటిఆర్ అయినా చిరునవ్వుతోనే కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన మంత్రి స్నాతకోత్సవం నుంచి నేరుగా ఆస్పత్రికి
కాలు చీలమండలం లిగ్మెంట్‌లో చిన్న చీలిక వచ్చినట్లు గుర్తించిన వైద్యులు
మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచన కాలి గాయంపై స్వయంగా
మంత్రి ట్వీట్ త్వరగా కోలుకోవాలని మంత్రి హరీశ్, ఎంపి సంతోష్ సందేశం

మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్ల సూచన

మహింద్రా వర్శిటీ స్నాతకోత్సవానికి బయల్దేరేముందు ప్రగతిభవన్‌లో కాలుజారి గాయపడిన కెటిఆర్ అయినా చిరునవ్వుతోనే కార్యక్రమం విజయవంతం చేసిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: కాలి గాయం నొప్పిని పంటి బిగువన భరిస్తూ మహింద్రా వర్శిటీ మొదటి స్నాతకోత్సవంలో మంత్రి కెటి రామారావు పాల్గొన్నారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి బయలుదేరేముందు ప్రగతి భవన్‌లో కెటిఆర్ కాలు జారి గాయపడ్డారు. అయినా ఆ విషయాన్ని తన వ్యక్తిగత సిబ్బందికి సైతం తెలియజేయకుండా నేరుగా స్నాతకోత్సవానికి వెళ్లారు. అక్కడ నాలుగు గంటలపాటు గడిపారు. స్నాతకోత్సవంలో వందలాది మంది విద్యార్థులకు పతకాలు, పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం వర్శిటీ ఛాన్స్‌లర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాతో కలిసి భోజనం చేశారు. తిరుగు ప్రయాణంలోనే తన కాలి నొప్పి గురించి సిబ్బందికి చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తెలియజేశారు. మహింద్రా వర్శిటీ స్నాతకోత్సవానికి తీసుకెళ్ళడానికి శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్ళామని, షూ వేసుకొని వస్తానని చెప్పిన మంత్రి కెటిఆర్ వడివడిగా షూ స్టాండ్ వైపు వెళుతూనే కాలు స్లిప్ అయి పడిపోయారని, వెంటనే తేరుకొని లేచి నించొని, షూ వేసుకొని కార్లో కూర్చున్నారని, మోకాలు, కాలి మడమ వద్ద కొద్దిగా నొప్పి ఉందని చెబుతూనే ‘మరేం ఫర్వాలేదు, సర్దుకుంటుంది’ అని మంత్రి చెప్పారని దిలీప్ వివరించారు. మాటల్లోనే మహింద్రా యూనివర్శిటీకి చేరుకోవడం, యూనివర్శిటీ ఛాన్స్‌లర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా తదితరులు మంత్రి కె.టి.ఆర్.కు స్వాగతం పలికారని, క్యాంపస్ మొత్తం తిప్పి చూపించారని, ఆ సమయంలోనూ కాలినొప్పితో బాధపడుతూనే పైకి నవ్వుతూనే కార్య్రకమంలో ముందుకు సాగారని తెలిపారు.

స్నాతకోత్సవం జరుగుతున్న ఆడిటోరియంలో సుమారు రెండు గంటలపాటు కెటిఆర్ గడిపారని వివరించారు. కెటిఆర్ నడుస్తుంటే జాగ్రత్తగా గమనించిన తనకు మాత్రం నొప్పి వల్ల ఇబ్బందులు పడుతున్నారని అర్ధమయ్యిందని తెలిపారు. ఇక తిరుగు ప్రయాణంలో కారులోకి ఎక్కిన తర్వాత కాలినొప్పి తీవ్రమైన సంగతిని తన సిబ్బందికి చెప్పి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్ళామని దిలీప్ తెలిపారు. అక్కడ ఫ్యామిలీ డాక్టర్ ఎంవి రావు నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన అన్ని పరీక్షలు చేసి కాలిచీలమండ వద్ద లిగమెంట్ టేర్ అయ్యిందని నిర్ధారించారని, కాలికి పట్టీవేసి మూడు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని డాక్టర్లు సూచించారని దిలీప్ తెలిపారు.

ట్విటర్‌లో కెటిఆర్ ప్రకటన..

తన కాలికి గాయం అయిన విషయాన్ని కెటిఆర్ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు. విశ్రాంతి సమయంలో ఓటీటీకి సంబంధించిన కార్యక్రమాలు, సినిమాల గురించి తనకు సలహాలు ఇవ్వాలని అభిమానులను కోరారు. నేడు కెటిఆర్ జన్మదినం ఉన్న సందర్భంలో ఇలా ఆయన అస్వస్థతకు గురికావటం ఆయన అభిమానులకు బాధ కలిగించింది. రాష్ట్రంలో భారీ వరదల కారణంగా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని, వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలిచి, ప్రజాప్రతినిధులు, శ్రేణులు గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద బాధితులకు తోచిన సాయం చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, కెటిఆర్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ఆయన అభిమానులు భారీ ఎత్తున పోస్టులు పెట్టారు. మరికొంత మంది నెటిజన్లు .. ఓటీటీకి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా కెటిఆర్‌తో పంచుకుంటున్నారు. ‘కాస్త విశ్రాంతి తీసుకోండి, త్వరగా కోలుకోండి అన్నయ్యా’ కాలక్షేపం కోసం అమెజాన్ ప్రైమ్‌లో ‘రన్‌వే34’ మూవీ చూడండ’ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మంత్రి కెటిఆర్‌కు సూచిస్తూ ట్వీట్ చేశారు. ‘త్వరగా కోలుకోండి రామ్’ అంటూ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News