Sunday, December 22, 2024

రూ. 40 వేల కోట్ల రాష్ట్ర ఆస్తులను అమ్మేందుకు కేంద్రం యత్నం !

- Advertisement -
- Advertisement -

Minister ktr letter to central government

 

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం కహానీలు చెపుతోందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు.

దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతుందని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని కేంద్ర సర్కార్….ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నాలపై తీ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు.

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టిఆర్‌ఎస్ పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News