సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరుపై ఎందుకీ మౌనం?
7 లేఖలు రాసినా వ్యక్తిగతంగా కలిసి గుర్తుచేసినా స్పందించని కేంద్రం
దశాబ్దలుగా చేనేతకు సిరిసిల్ల ప్రధాన కేంద్రం
చేనేత రంగంలో విశేషంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
ఇప్పటికైనా క్లస్టర్‌ను మంజూరు చేయండి, కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు మంత్రి కెటిఆర్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సిపిసిడిఎస్) కింద సిరిసిల్లకు వెంటనే మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కె. తారకరామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఒక లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఏడు లేఖలు రాసినట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు వ్యక్తిగత సమావేశాల ద్వారా కేంద్రానికి పదేపదే గుర్తు చేశామన్నారు. కానీ దృరదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా టెక్స్‌టైల్స్ రంగంలో రాష్ట్రం పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొన్ని దశాబ్దాలుగా చేనేత, జౌళి రంగానికి సిరిసిల్ల ప్రధాన కేంద్రంగా కొనసాగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక శాతం పవర్‌లూమ్ కార్మికులు ఇక్కడే ఉన్నారన్నారు.
కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల పట్టణంలో నాణ్యమైన పవర్‌లూమ్ రంగ మానవ వనరులు ఉన్నాయన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల అవకాశాలు సిరిసిల్లాలో ఉన్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ చేనేత రంగానికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం లభించడం లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు అమలవుతున్నాయని విమర్శించారు. అదే సమయంలో ప్రగతిశీల రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా దూసుకపోతున్న తెలంగాణకు మాత్రం ఆర్ధిక సహాయం చేయడానికి మాత్రం కేంద్రానికి మనస్సు రావడం లేదని ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో ఒక అంతర్భాగమన్న విషయాన్ని కేంద్ర పాలకులు గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉపాధి కోసం అనేక చర్యలు
పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేత కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. 40శాతం ఇన్‌పుట్ సబ్సిడీ వైజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్ఫండ్ తదితర పథకాలతో చేనేత, పవర్లూమ్ కార్మికులకు నిరంతరం పని అందించేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుందన్నారు. అలాగే, వెనుకబడి చేనేత కుటుంబాలకు ఆదాయ వనరులను సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కార్యక్రమాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.
కేంద్రం నుంచి సహకారం నిల్
అభివృద్ధిలో శరవేగంగా దూసుకపోతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆదరణ కల్పించకపోవడంతో మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీపడలేకపోతున్నదని కేంద్రమంత్రికి రాసిన లేఖలో కెటిఆర్ ప్రస్తావించారు. చేనేత, జౌళి రంగాన్ని సంపూర్ణంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యను ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం బడ్జెట్‌లో అదనపు నిధులు సైతం కేటాయించిన విషయాన్ని కెటిఆర్ వివరించారు. ప్రధానంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టిందని ఆయన తెలిపారు. వనరులు లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పథకాలు సహాయాన్ని ప్రకటిస్తోందన్నారు. దానికి తాము అడ్డు చెప్పడం లేదన్నారు. కానీ అదే సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఎదురుచూస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి కాలయాన లేకుండా తక్షణమే మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
పిఎల్‌ఐ నిధులపై భారీ ఆశలు
జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఐదేళ్లలో రూ.10,683 కోట్లు వెచ్చించేలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. దాంతో లబ్ధి పొందనున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. అయితే కేంద్రం ఇప్పటివరకు నిధులు మాత్రం కేటాయించలేదు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర చేనేత, జౌళి శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. పిఎల్‌ఐ కింద కనీసం రూ.2వేల కోట్లు రాష్ట్రానికి అందించాలని అభ్యర్థించారు. వాటిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కెటిఆర్ మరోమారు లేఖాస్త్రాన్ని సంధించారు.