మన తెలంగాణ/హైదరాబాద్ : భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్లతో రాష్ట్ర ఐటి, పారిశ్రామిక శాఖ మంత్రి కె. తారకరామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన వీరి భేటిలో ఐటి, పారిశ్రామిక అభివృద్ధి వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సత్యనాదెళ్లతో ఉన్న ఫొటోను శుక్రవారం కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. బిజినెస్, బిర్యానీ గురించి చాలా మాట్లాడుకున్నామంటూ తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో ఐటి, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, హైదరాబాద్‌లో గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు మంత్రి కెటిఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.
కాగా రెండు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన ఆయన బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్లో ‘చాట్ జిపిటి’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబోను పరిచయం చేశారు. ఆ రోబోతో సత్యనాదేళ్ల మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏముంటాయని ఆయన చాట్ రోబోను ప్రశ్నించగా ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్ రోబో క్షమాపణ చెప్పింది.
కాగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీతోనూ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. డిజిటల్ ఇండియా విజన్‌ను గ్రహించి ప్రపంచానికి వెలుగుగా నిలిచేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. డిజిటలైజేషన్ కేంద్రం దృష్టి సారించడంపై ప్రశంసలు కురిపించారు. టెక్ దిగ్గజం భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్‌ను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.