హైదరాబాద్ : దుబాయ్ పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అక్కడ కీలక భేటీల్లో పాల్గొంటున్నారు. బుధ వారం యూఏఈ -ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఐబిసి) సీనియర్ ప్రతినిధుల బృందంతో ఆయన సమావేశం అయ్యారు. కెఇఎఫ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఫైజల్ కొట్టికోలన్ నేతృత్వంలోని యుఐబిసి ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఇండియా, యుఎఇ మధ్య వాణిజ్యం బలోపేతానికి, అనుసంధానానికి యుఐబిసి ఒక ఉత్ప్రేరక పాత్ర పోషించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకు సంబంధించిన వ్యూహాత్మక చర్చలు ఆ బృందంతో జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఇండియా ఒక వైవిద్యమైన దేశమని, ఇక్కడ అనేక అనుకూలతలు ఉన్నాయిన్నారు.
దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రాల వారిగా సంప్రదింపులు జరపడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా సూచించారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, యుఐబిసి ప్రతినిధులు నగరానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలంచవచ్చని వారిని ఆహ్వానించారు. తెలంగాణలో పర్యటించడం ద్వారా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని వెల్లడించారు. యుఎఇ, ఇండియా ప్రభుత్వాలు కలిసి యుఐబిసి ఇండియా అనే బిజినెస్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ పని చేస్తుంటుంది. ఈ సమావేశంలో ఇఎఫ్‌ఎస్ ఫెసిలిటీస్ సిఇవొ టారిఖ్ చౌహాన్, బ్యూమెర్క్ చైర్మన్ సిద్దార్థ్ బాలచంద్రన్, ఎమ్మార్ సిఇవొ అమిత్ జైన్ తదితరులు పాల్గొన్నారు.