Monday, December 23, 2024

ఎవ్వరున్నా వదిలిపెట్టం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం సిఎం కెసిఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం బిఆర్‌కెఆర్ భవన్‌లో మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సిఎస్ శాంతికుమారి, వినయ్‌కుమార్ పాల్గొనగా.. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డితో పాటు ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే గానీ.. సంస్థాగత వైఫల్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అస్సాం, యూపి, గుజరాత్ లో పేపర్ లీక్ లు జరిగాయి అక్కడ మంత్రులు రాజీనామాలు చేశారా? ఆని ఆయన ప్రశ్నించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్లకు కొంత బాధ ఉంటుది.. కానీ ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

త్వరలో పరీక్షలు.. మళ్లీ ఫీజు చెల్లించక్కర్లేదు..

‘టిఎస్ పిఎస్‌సి పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు చేయాల్సిన మార్పులను చేస్తాం. నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. ఈ పరీక్షలను రాసే విద్యార్థులు ఎవరూ ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారెవరూ ఫీజు చెల్లించనక్కర్లేదు. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి మెటీరియల్ అంతా. ఆన్‌లైన్‌లో పెడతాం. ఉచితంగా మెటీరియల్ ఇచ్చే బాధ్యత మాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. రీడింగ్ రూమ్‌లు సైతం 24 గంటలూ తెరిచే ఉంచాలని నిర్ణయించాం. ఉచిత మెటీరియల్ తో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తాం. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి సహకరిస్తాం‘ అని మంత్రి కెటిఆర్ వివరించారు.

నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపైనే..

నీళ్లు నిధులు, నియామకాల పునాదులపైనే కెసిఆర్ సారథ్యంలో ఉద్యమం నడించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చేలా చట్టసవరణ చేసి రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకున్నాం. తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా ఉద్యమాల్లో పాల్గొంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతోంది. తప్పు జరిగినప్పుడు ఎలా సరిదిద్దాలి? ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంటుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా టిఎస్పీఎస్సీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. చిన్న లోపం తలెత్తినా సరిదిద్దుకొనే సంస్కారం మాకు ఉంది. ఆపోహలు సృష్టించే వారిని విశ్వసించవద్దు‘ అని విజ్ఞప్తి చేశారు.

155 నోటిఫికేషన్‌లు.. 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించి ‘దేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా టిఎస్ పీఎస్సీ పేరుగాంచింది. ఎన్నో రకాల సంస్కరణలు, భాగంగానే మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి కీలక నిర్ణయాలతో ముందుకెళ్తంది. అందులో ఓటిఆర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపు ద్వారా ఫీజు తీసుకున్నాం. కంప్యూటర్ ఆధారిత టెస్టును నిర్వహించే దానికి శ్రీకారం చుట్టింది. సిబిటి విధానంలో భాగంగా 99 పరీక్షలను నిర్వహించగా 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టాం. సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా అనేక పద్ధతులు తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి టిఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి మార్పులు, చేర్పులను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై అధ్యయనం చేసి వెళ్లారు. దేశంలోని 19 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, సభ్యులు ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం పాతధోరణులకు తావు ఉండొద్దనే నిరుద్యోగ యువకులకు ఇంటర్వ్యూ రద్దు చేశాం’ అన్నారు.

రాజశేఖర్ బిజెపి క్రియాశీల కార్యకర్త…

పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానంతో బిఆర్‌ఎస్ తరపున డిజిపికి ఫిర్యాదు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బిజెపి క్రియాశీల కార్యకర్త, సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆ పార్టీ పట్ల అనుకూలతను ప్రదర్శిస్తూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ కేసులో ఉండటంతో అనుమానించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా ప్రభుత్వంపై నిందలు వేసి అప్రతిష్ట పాల్గొనే కుట్ర ఇందులో ఏమైనా ఉందా? అనే కోణంలో శోధించాలని డిజిపిని కోరుతున్నాం.

దీని వెనుక ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా సరే వదిలి పెట్టె ప్రసక్తే లేదు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరీక్ష రాసిన వాళ్ళు మళ్లీ రాయాలని బాధపడుతున్నారు. ఎలాంటి అనుమానాలు రావొద్దనే పరీక్షలు రద్దు చేశాం. క్వాలిఫై అయిన వాళ్లు పెద్ద మనుసుతో చేసుకోండి. అపోహలు, అనుమానాలు నమ్మొద్దు. సిట్ విచారణ ఇంకా పూర్తికాలేదు.. అన్ని విషయాలూ బయటకు వస్తాయి‘ అని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News