Sunday, November 17, 2024

ఆత్మవంచన దీక్ష

- Advertisement -
- Advertisement -

Minister KTR open letter to Bandi Sanjay

బిజెపి కొలువుల హామీ ఏ గంగలో… ‘బండి’ది

2కోట్ల ఉద్యోగాల కల్పనపై లెక్కచెప్పే దమ్ముందా?
కేంద్రం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్ని?
ఐటిఐఆర్‌ను రద్దు చేసింది మీరు కాదా?
లక్షలాది ఐటి కొలువులకు గండి కొట్టి యువత నోట్లో మట్టి కొట్టిందెవరు?
మళ్లీ సిగ్గులేకుండా నిరుద్యోగ దీక్షకు దిగుతారా?
చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్‌లో దీక్షకు దిగు
రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులపై కపట ప్రేమ
యువతను రెచ్చగొట్టి ఉద్యోగాలకు ప్రిపేర్ కాకుండా చేసే కుట్ర
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ

కేంద్ర రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన మోడీ ప్రభుత్వం తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా?. కొత్త ఉద్యోగాల నియామ కాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగు లకు విఆర్‌ఎస్, సిఆర్‌ఎస్ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన బిజెపిది. ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి బిడ్డల రిజర్వ్‌డ్ జాబ్స్ ఎగరగొట్టిన పాపం కేంద్రానికి కాక ఇంకెవ్వరికి తగులుతుంది
                                                                                                 మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షపై టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తలపెట్టినది నిరుద్యోగ దీక్ష కాదు…. పచ్చి అవకాశవాద దీక్ష’ అని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బిజెపి హామీ ఏమైంది? అని నిలదీశారు. కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని కొలువులు ఇచ్చిందో లెక్క చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు….ఉన్న ఉద్యోగాలనే మోడీ ప్రభుత్వం తొలగిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్‌కు మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉపాధి అవకాశాల్లో బిజెపి వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అదే సమయంలో ఉపాధి కల్పనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని కూడా వివరించారు. నిజం నిప్పులాంటిదని, దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ఈ సత్యం బాగా తెలిసినా, ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే మీరు (బండి సంజయ్) దొంగదీక్షకు పూనుకున్నారన్నారు. కేంద్రంలోని మీ బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మీ ప్రభుత్వ అస్తవ్యవస్థ విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెల్లుతున్నారన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీది నిరుద్యోగ దీక్ష కాదు… పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్ష అని వ్యాఖ్యానించారు. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి రాజకీయ ఉద్యోగం లేక చేస్తున్నదే ‘మీ నిరుద్యోగ దీక్ష’ అని కెటిఆర్ అభివర్ణించారు. రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీ యువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారన్నారు.

డిగ్రీ పూర్తయిన అందరికీ ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదన్నారు. అలాగని కేంద్రంలోని మీ ప్రభుత్వం మాదిరిగా తాము ఏనాడు తప్పించుకునేందుకు ప్రయత్నించ లేదన్నారు. ఉపాధి కల్పనలో తమ నిబద్ధతను చాటిచెప్పేలా సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామని సగర్వంగా చెప్పగలనని అన్నారు. ఉద్యోగ కల్పనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అత్యద్భుత విజయాలు మీకు తెలిసినవే…అయినా తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో డ్రామా దీక్షకు దిగారని ఎద్దేవా చేశారు. మీ కోసం మళ్లీ ఆ విజయాలను క్లుప్తంగా గుర్తు చేస్తానన్నారు.

ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి రాష్ట్ర ప్రభుత్వం లక్షాముప్పై మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన టిఎస్… ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా కేవలం పక్షం రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను జారీ చేస్తున్నామన్నారు. ఫలితంగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకరాగలిగామన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన చేశామన్నారు. వచ్చిన ఉద్యోగావాకాశాలను రాష్ట్ర యువతకు దక్కేలా ప్రత్యేక శిక్షణ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ని ఏర్పాటు చేసి మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

టిఎస్ ఐపాస్ లెక్కలోకి రాని మరెన్నో లక్షల ఉద్యోగాలను ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా సృష్టించామన్నారు. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక యూనిట్లు పెట్టుకునే వారికోసం టిఐడియా, టిప్రైడ్ వంటి విధానాలతో ప్రోత్సాహిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే కోట్లాది మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేత చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ చదువుకున్న నిరుద్యోగ సోదరీ సోదరులతోపాటు, కులవృత్తులపైన ఆధారపడిన లక్షలమందికి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని ఆ లేఖలో కెటిఆర్ అడిగారు.

వాస్తవాలను జీర్ణించుకోలేకనే దొంగ దీక్ష

వాస్తవాలు ఇలా ఉంటే వాటిని జీర్ణించుకోలేక బూటకపు దీక్షకు పూనుకున్నారని బండి సంజయ్‌ను ఉద్దేశించి లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి ఉద్యోగ ప్రయత్నాల నుంచి పక్కదారి పట్టించడానికి యత్నిస్తున్నారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీని ద్వారా వారి జీవితాలను నాశనం చెయ్యడానికి పూనుకుంటున్న మీకు ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో మీ వైఖరిని రాష్ట్ర యువత తరపున నిలదీస్తున్నానన్నారు. దమ్ముంటే తాను లేవనేత్తె ఈ అంశాలపైన స్పందించాలని డిమాండ్ చేశారు.

దేశానికి, యువతకు ‘అచ్చే దిన్’ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మీ బిజెపి ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మీ హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో…. దేశానికి లెక్క చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. ఏం వివరాలు అడిగినా… డేటా లేదు.. తెలియదు… గుర్తులేదు… మర్చిపోయాం అని తప్పించుకుని తిరిగే సర్కార్ కదా మీది కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. తాము అడిగిన వాటికి ఏ రోజు కరెక్టు సమాధానం చెప్పలేదన్నారు. లెక్కా పత్రం లేని జవాబుదారీ తనం లేని దిక్కుమాలిన పాలన చేసే మీరు….టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమా? అని అన్నారు. పక్కాగా లెక్కలు చెప్పే పారదర్శక పద్దతి టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఎన్ని నోటిఫికేషన్లు వేసామో… ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో డిపార్టుమెంట్ల వారీగా వివరాలన్నీ ప్రజల ముందు ఉంచిన తమ నిబద్దత ముందు పకోడీలు వేసే పనిని ఉద్యోగంగా చూపిన మీ మోడీ పాలన సాటికి వస్తుందా? అని ప్రశ్నించారు.

ఏడేళ్ళలో రాష్ట్ర యువతకు పిసరంత సాయమైనా చేసిందా?

కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు అందిన పిసరంత సాయమేమైనా ఉందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? అని అడిగారు. ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా హైదరాబాదును ఇన్వెస్టర్ల డెస్టినేషన్ గా మలుస్తున్న ప్రభుత్వం మాది అని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది తామైతే, ఇక్కడి యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సర్కారు మీదన్నారు.

కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్భుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. లక్షలాది యువత ఐటి జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి…మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? అని మండిపడ్డారు. మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. తెలంగాణ యువత మీద మాకున్నది పేగు బంధం ప్రేమ అని అన్నారు. మీలాగా ఓట్ల డ్రామా కాదన్నారు. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చిన భూమిపుత్రుల ప్రభుత్వం తమదైతే కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించకుండా నెలలకు నెలలు ముప్పుతిప్పలు పెట్టిన కుటిల నీతి, కపట కేంద్ర ప్రభుత్వం మీదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను తెగ అమ్ముతున్నది ఎవరు?

కేంద్ర రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన మోడీ ప్రభుత్వం తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? అని కెటిఆర్ నిలదీశారు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు విఆర్‌ఎస్, సిఆర్‌ఎస్ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన మీది కాదా?… ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు పరం చేస్తూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి బిడ్డల రిజర్వ్ డ్ జాబ్స్ ఎగరగొట్టిన పాపం కేంద్రానికి కాక ఇంకెవ్వరికి తగులుతుందన్నారు. ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ మాదిరి పాలన చేస్తూ ఉన్న వాటిని అమ్ముకుంటున్న మీరెక్కడా? ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా ఆర్‌టిసి, విద్యుత్, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ?అని అన్నారు.

ఇక్కడ ఒక సూటి ప్రశ్న – తెలంగాణ యువత తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. మీ కేంద్ర ప్రభుత్వంగానీ, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా? అని అడిగారు. బిజెపి పార్టీ అధికారం వెలగబెడుతున్న ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా? అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల వరుసలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం కాదా? అని వ్యాఖ్యానించారు. బిజెపి పాలిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపాధిలేక లక్షల మంది యువత బతుకుతెరువు కోసం రాష్ట్రానికి వలస వస్తున్నది నిజం కాదా? అని కెటిఆర్ ప్రశళ్నించారు. ఇక్కడ పెరిగిన ఉపాది అవకాశాల నేపథ్యంలో రాష్ట్రానికివస్తున్న రివర్స్ మైగ్రేషన్ నిజం కాదా? ఈ విషయాలపై కనీస సమాచారం కూడా లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

దమ్ముంటే దీక్ష జంతర్‌మంతర్‌లో చెయ్యి

మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు… ఢిల్లీలోని జంతర్ మంతర్ లో! అని కెటిఆర్ సూచించారు. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాదు…. లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 లక్షల ఉద్యోగ ఖాళీలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలు మొత్తంగా 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలన్నారు.

మీరొక చేతకాని పార్లమెంట్ సభ్యులు

టిఆర్‌ఎస్ ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్కు, మెగా పవర్ లూమ్ పార్క్, వీవింగ్ పార్క్ వంటి మరెన్నో పారిశ్రామిక పార్కులను చేపట్టిందన్నారు, వాటిల్లో ఏ ఒక్కదానికైనా అదనపు సహాయం తీసుకురాలేని చేతకాని పార్లమెంటు ప్రాతినిధ్యం మీది కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని కోరినా కొర్రీలు వేసిన ప్రభుత్వం కేంద్రానిది కాదా? అని అడిగారు. హామీ ఇచ్చిన ఐటిఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, మీ చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సాహం ఏమైనా ఉంటే చెప్పాలని…. లేకుంటే కొలువుల భక్షకులే దొంగ దీక్షలు చేస్తామంటే కొంగలు కూడా సిగ్గు పడుతాయన్నారు.

రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులపై కపట ప్రేమను గుమ్మరిస్తూ రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న మీరు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోండని సూచించారు. నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండన్నారు. లేకపోతే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారన్నారు. చివరగా రాష్ట్ర యువత అకాంక్షలను సంపూర్ణంగా అర్దం చేసుకున్న ప్రభుత్వం తమదన్నారు. యువతకు ఉపాధి కల్పనలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు టిఆర్‌ఎస్ ప్రయత్నం యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే అసత్య ప్రచార ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో అలోచించాలని రాష్ట్ర యువత ఆలోచించాలని బండికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News