హైదరాబాద్: సిరిసిల్లలో రైతుల నిరసనదీక్షలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. బిజెపి పాలనలో రైతులు రోజూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కెటిఆర్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏడేళ్ల క్రితం ప్రధాని మోడీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మోడీ చెప్పినట్టు ఇవాళ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా..? అని ఆయన ప్రశ్నించారు. చాయ్ పే చర్చ అని చెప్పి మోడీ అధికారంలోకి వచ్చారని కెటిఆర్ అన్నారు. ఇవాళ దేశమంతా రైతుల కష్టాలపై మాత్రమే చర్చ, పెరిగిన పెట్రోల్, డీజిల్ గురించే చర్చ, రూ. వెయ్యి దాటిన గ్యాస్ సిలిండర్ గురించే దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. 2014కు ముందు కూడా క్రూడాయిల్ ధర 105 డాలర్లున్నప్పుడు పెట్రోల్ ధర రూ.75 మాత్రమే, ఇప్పూడు క్రూడాయిల్ 105 డాలర్లే ఉంటే పెట్రోల్ ధర రూ. 120కి చేరిందని ఆరోపించారు. చమురు ధరల పెరుగుదల కాంగ్రెస్ వైఫల్యమని గతంలో మోడీ అన్నారు. ఎక్సైజ్ సుంకాన్ని రూ. 30కి పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. 2014కు ముందు సిలిండర్ ధర రూ.410 మాత్రమే ఉండేది. మోడీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఎత్తివేయడమే అధిక ధరకు కారణమన్నారు.