నిర్మల్: మేము ఢిల్లీకి గులాంగిరి కాదు.. గుజరాత్‌కు సలాం గిరి కాదని, ఎవరికి భయపడేది లేదని, ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం బిఆర్‌ఎస్ పార్టీకి లేదని, మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారులమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ముందుగా సోన్ మండలంలోని పాత పోచంపాడ్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దిలావర్‌పూర్ మండలంలోని గుండంపెల్లి ప్రాంతంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి 7 టిఎంసిల నీరు 27వ ప్యాకేజీ శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
అలాగే 50వేల ఎకరాలకు 715 కోట్లతో నీటిని విడుదల చేశారు. పామ్ ఆయిల్ ఇండస్ట్రీకి 300 కోట్లతో శంకుస్థాపన పాక్‌పట్లలో నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని తహసీల్థార్ కార్యాలయ ఆవరణలో స్థలం 2.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.10.15 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించనున్నా సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన, అలాగే నిర్మల్ పట్టణంలో మంచినీటి సరఫరా మెరుగుపర్చేందుకు అమృత్ పథకంలో భాగంగా రూ. 62.50 కోట్లతో ఎఫ్‌ఐడిసి నిధుల మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. నిర్మల్ పట్టణంలోని మినీ ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రేస్ వాళ్లు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని తెలంగాణ సర్కార్ కేవలం 10 ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో నేడు నిర్మల్ జిల్లాగా మారి అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళ్తోందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో నిర్మల్ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. నిర్మల్‌లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వందల మంది విద్యార్థులు డాక్టర్లు కావడానికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. అలాగే 300 పడకల ఆసుపత్రిని నిర్మించామని, క్యాన్సర్, గుండె జబ్బు తదితర ఎలాంటి పెద్ద సమస్యలు వచ్చినా నిర్మల్‌లోనే నయం చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
నేడు నిర్మల్‌లో ఉన్న కలెక్టరేట్ భవనాలు ఇతర రాష్ట్రాల్లో సెక్రెటరీలు సైతం లేవన్నారు. అలాగే నిర్మల్‌లో ఐదు వేల డబుల్ బెడ్ రూమ్‌లు కట్టించి ఇళ్లు లేని నిరుపేదలకు దేవుడిలాగా ఇళ్లు కట్టించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఎవరైన ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్తానంటే అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్‌షిప్ రూ. 20 లక్షలను వేలాది మందికి ఇచ్చిన మాట వస్తావం కాదా.. అని ప్రశ్నించారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనత కాదా అన్నారు. ఖరీఫ్, యాసంగి వరి నాట్లు వేసే సమయంలో మన సెల్ ఫోన్‌లు టింగ్ ..టింగ్ … అని మోగుతూ రైతుబంధు డబ్బులు మన ఖాతాలో జమ కావడం వాస్తవం కాదా …? అని అన్నారు.
70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.73 వేల కోట్ల రూపాయిలు జమ అయినవి వాస్తవం కాదా … అని ప్రశ్నించారు. అలాగే రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్ధేశంతో రైతుభీమా పథకం అమలు చేసి మృతి చెందిన రైతు కుటుంబాలకు ఇస్తున్నా మాట వాస్తవం కాదా… అని అన్నారు. నేడు కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ పథకాలతో మేన మామగా సిఎం కెసిఆర్ ఒక లక్ష పదహారు రూపాయిలు ఇస్తున్న ఘతన సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఇతర ఏ రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో మాత్రమే అమలు అవుతున్నాయన్నారు. అభివృద్ధి చేశాం కాబట్టే ఓట్లు అడిగే హక్కు బిఆర్‌ఎస్ పార్టీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలంగాణలో అస్సలే అభివృద్ధే జరగడం లేదని కొందరు గాలిమోటర్‌లో వచ్చి గాలి మాటలు చెప్పి పోతున్నారన్నారు. నేడు మోడీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని , రూ.400 ఉన్న సిలెండర్ ధరను రూ.1250కు పెంచారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అనేకంగా పెంచిన ఘనత మోడిదేనన్నారు. బిజెపి వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే పంద్రాలాక్ ఎక్కడ అని నిలదీయాలన్నారు. మోదీ పంద్రాలాక్ డబ్బులు వచ్చినోళ్లు బిజెపికి ఓటు వేయండి … కెసిఆర్ రైతుబంధు వచ్చినోళ్లు బిఆర్‌ఎస్‌కు ఓటు వేయండి అన్నారు. అలాగే ఆరు దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెసోళ్లు ఆగం ఆగం చేసి నేడు ఆరు హామీలు అమలు చేస్తామనడం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెసోళ్లు సచ్చిన శమం ముందు శంఖం ఊదినట్లు ఆరు హామీలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
నిర్మల్‌లో మాస్టార్ ఫ్లాన్ గురించి అవగాహన లేకుండా కొంత మంది మాట్లాడుతున్నారని ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి అందరికి న్యాయం జరిగే విధంగా నిర్మల్ మాస్టర్ ఫ్లాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో నూతనంగా పొన్కల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో జోగు రామన్నను, ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా జాన్సన్ నాయక్‌ను, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ కోరిపెల్లి విజయలక్ష్మీ, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్థన్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి, ఇరిగేషన్ చైర్మన్ వేణుగోపాల్‌చారీ, పైడిపెల్లి రవీంధర్, అల్లోల మురళీధర్‌రెడ్డి, గేడం నగేష్, అడ్డి భోజారెడ్డి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తూ ఏర్పాటు చేశారు.