ఆ స్థానంతో మాకు ఒరిగేదేమీ లేదు, గెల్లు స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చాడు : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఫలితంతో తమకు ఒరిగేది ఏమిలేదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. పార్టీ అభ్యర్ధి విజయం కోసం మంత్రుల నుంచి మొదలుకుని బూత్‌స్థాయి నాయకుడి వరకు అందరూ తమ శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. దీనికి వారినందరిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.టిఆర్‌ఎస్ పార్టీ తన 20యేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అనేక విజయాలను, పరాజయాలను ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు చాలా సహజమన్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఓడిపోయినంత మాత్రం ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులను ఆయన సూచించారు. గెలుపు, ఓటములను సమానంగా తీసుకుంటామన్నారు. ఈ మేరకు సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
విజయం కోసం చివరి నిమిషం వరకు యత్నించిన మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ నేతలకు, సోషల్ మీడియా వారియర్లకు కెటిఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్‌లో తమ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ స్పూర్తివంతమైన పోటీ ఇచ్చారని అభినందించారు. రాష్ట్రంలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఒక్క స్థానాన్ని కోల్పోయినంత మాత్రాన రాజకీయంగా ఒనగూరే నష్టం లేదన్నారు. అలాగే ప్రభుత్వానికి వచ్చే నష్టం అంతకంటే లేదన్నారు. రాష్ట్రంలో గల్లీ స్థాయి నుంచి మొదలుకుని నిన్నా, మొన్న జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ తన సత్తాచాటుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. విజయాలకే కేరాఫ్ అడ్రస్‌గా మారిన టిఆర్‌ఎస్‌కు ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నికల ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏదేమైనప్పటికీ అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని అన్నారు. పార్టీ పరంగా తాను కూడా శిరసావహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను లోతుగా సమీక్షించుకుని తిరిగి పునరుత్తేజంతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతామని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఓటమిని భవిష్యత్తులో విజయానికి సోపానం వేసుకునే విధంగా ముందుకు సాగుతామని కెటిఆర్ అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ పార్టీలు కమ్ముక్కుఅయ్యాయి
కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలు రెండు కుమ్మ క్కు అయ్యాయని పేర్కొనేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రత్యక్ష నిదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది పార్టీల దిగజారుడు రాజకీయాలకు తార్కా ణం అని ఆయన వ్యాఖాయనించారు. ఒక్క ఉపఎన్నిక గెలుపు కోసం నీతి, నియమాలకు నీళ్లు వదిలిపెట్టారని ఆరోపించారు. రాజకీయ విలువలను పూర్తిగా తుంగలోతొక్కారన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసిన వారందరికి పేరుపేరును కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేమి తగ్గలేదన్నారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బిజెపిలు కలిసిపనిచేశాయన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారన్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బిజెపి, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఏది ఏమైనా టిఆర్‌ఎస్ పార్టీ ఒక్క ఓటమితో కుంగిపోదన్నారు. గెలిచినాడు పొంగిపోలేదన్నారు. ఓడినా..గెలిచినా టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందన్నారు.