ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇవ్వండి
ఇటుకతో కొడితే… రాయితో కొడతామని బదులివ్వండి
కెసిఆర్‌లో ఫైర్ ఆరలేదు
కామారెడ్డి టిఆర్‌ఎస్ సభలో పార్టీ శ్రేణులకు కేటిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్: ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇవ్వాలని మంగళవారం జరిగిన కామారెడ్డి టిఆర్‌ఎస్ సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇటుకతో కొడితే… రాయితో కొడతామని బదులివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కలిసొచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుట్టినట్టు తెలంగాణ రాష్ట్రానికి కేసిఆర్ వచ్చారని ఆయన అన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెటిఆర్‌కే దక్కుతుందన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వారు చేసింది గుడ్డి గుర్రాలకు పండ్లు తోమినట్టుందని ఎద్దేవా చేశారు. కేసిఆర్ సాఫ్ట్ అయ్యాడని అందరు అనుకుంటున్నారు కానీ ఒరిజినల్‌గా ఉద్యమస్ఫూర్తితోనే ఉన్నారని, అవసరమైతే రైతుల కోసం కేంద్రం పై ఉద్యమించేందుకు సిద్ధమయ్యరన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బిఈడి కళాశాలలో టిఆర్‌ఎస్ అసెంబ్లీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డిని జిల్లా చేసిన ఘనత కేసిఆర్‌దేనని అన్నారు. దశాబ్దాల గిరిజన సోదరుల కల తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మనం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పక్క రాష్ట్రాల ప్రజలు, నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఏ గ్రామంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న వసతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేసిఆర్‌లాగా రైతుకు ఆర్థిక ప్రేరణ కల్పించాలనే ఆలోచన భారతదేశంలో ఎవరికైనా వచ్చిందా అని అన్నారు. ప్రతిపక్షాలను చేసే దుష్ప్రచారాలను ఎదుర్కొనే విధంగా సోషల్ మీడియాలో మన కార్యకర్తలు విజృంభించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వరి ధాన్యం కొనే విధంగా ఈ నెల 12న నిర్వహించే ధర్నా ఉండాలన్నారు. మరో 80 ఏండ్లు తిరుగులేని పార్టీగా ఉండేందుకు మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళదమన్నారు. ఏమీ చేయలేనివాడు కేసిఆర్ పై కారుకూతలు కూస్తున్న వారి నాలుక కోసేస్తామన్నారు.
బాండ్ పేపర్ అడ్డం పెట్టుకొని గెలిచిన వ్యక్తి చేసింది ఏమిటో చూపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ కాపీ కొడుతుందని ఆరోపించారు. బిజెపి ఢిల్లీ నాయకులేమో వరి కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, గల్లీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటిఆర్‌తో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ రాజు, కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నరాజేశ్వర్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, ఎం.కె.ముజీబుద్దిన్, గోపిగౌడ్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మరియు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కర్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.