Tuesday, November 5, 2024

ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కెసిఆర్ ప్రజా అభిమానం ముందు ఎంత మంది తీస్‌మార్‌ఖాన్‌లు వచ్చిన ఏమి చేయలేరన్నారు.ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ బక్క పల్చని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓడించేందుకు డిల్లీ నుంచి మోడీ, అమిత్‌షా, బిజెపి పాలిత 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్దిరామయ్య, డీకే శివకుమార్‌లు వస్తున్నారని, అయినా సింహం సింగిల్‌గా వస్తుందని కెటిఆర్ అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలలో సమర్థులైన నాయకులు లేక పోరుగు రాష్ట్రాల నుంచి మందల్లా వస్తున్నారని ఆయన ఎద్దెవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రెస్‌కు గతంలో ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక రైతు,తాగునీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారని, కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త్త, నేడు బిఆర్‌ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త అని అన్నారు. బిఆర్‌ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని దేశంలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఆలోచించలేదని, దేశంలో పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక మొనగాడు కెసిఆర్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రూ. 73 వేల కోట్లు రైతుబంధు అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఇటీవల వికారాబాద్, తాండురు సభలో కర్నాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటు ఇస్తున్నామని తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే 5 గంటల కరెంటు ఇస్తామనడాన్ని మంత్రి కెటిఆర్ ఎద్దెవా చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుంటే కాంగ్రెస్ నేతలు 5 గంటల కరెంటు ఇస్తామనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బిజెపి అంతటా ఎత్తిపోయిందని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. యుద్దం చేసే దమ్ము, ధైర్యం లేక బరిలో నిలవకుండా పారిపోయాడని మంత్రి ఎద్దేవా చేశారు. కల్వకుర్తిలో బిజెపి ఉందా, ఆఖరి వరకు ఆయన కూడా ఉంటాడో, పారిపోతాడో తెలియదని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, తెలంగాణ రాక ముందు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఏ విధంగా ఉన్నాయి. బేరిజు వేసుకోని ఓటు వేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి డబ్బు సంచులతో తిరుగుతున్నాడని మోసాన్ని మోసంతోనే జయించే విధంగా కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బు తీసుకోని కారుగుర్తుకు ఓటు వేయాలని కెటిఆర్ సూచించారు. ఈ సభలో మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,

రాష్ట్ర మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ఉప్పల వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, జెడ్పిటిసిలు జర్పుల దశరథ్‌నాయక్, ద్యాప విజితారెడ్డి, అనురాధ పత్యనాయక్, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ తోట గిరియాదవ్, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్‌గుప్తా, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, వైస్‌ఎంపీపీలు జక్కు అనంతరెడ్డి, బావండ్లపల్లి ఆనంద్, మండల పార్టీ అధ్యక్షులు పోనుగోటి అర్జున్‌రావు, కంబాల పరమేష్, పత్యనాయక్, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, జోగు వీరయ్య, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News