జన్నారం: ప్రగతిపథంలో నడిచే రాష్ట్రాన్ని ఎవడి చేతిలో పడితే వారి చేతిలో పెడితే ఆగం అవుతుందని ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే మా అత్తలకు రూ. 5 వేల పింఛన్లు ఇస్తారని మరీ మాకేంటని ఆడబిడ్డలు అడుగుతున్నారని అందుకే డిసెంబర్ 3 తరువాత కోడళ్లకు సిఎం కెసిఆర్ శుభవార్త చెబుతారని కెటిఆర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు కాదు ఆరుగురు సిఎంలు ఆరు నెలలకో సిఎం మారుతారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆదరణ లేదని, ఎవరికి వారే ఎమునా తీరే చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ఉందని, సిఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది పైజామాలు కుట్టించుకొని సిద్ధంగా ఉన్నారని, ఆరు నెలలకు ఒక సిఎం మారే కాంగ్రెస్ పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెడదామా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో చూసినా హనుమంతుని ఆలయం లేని గ్రామం లేదని అలాంగే ముఖ్యమంత్రి కెసిఆర్ పథకం అందని ఇల్లు లేదని, 9 సంవత్సరాల ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశామన్నారు.
55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అభివృద్ధ్ది ఏమి లేదని విమర్శించారు. దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తమని వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమేనని, గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుందని నమ్మబలుకుతున్న రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో అతనికే తెలియని పరిస్థ్దితి ఉందని అన్నారు. ఎన్నికలప్పుడు ఎందరో చిల్లరగాళ్ల్లు వస్తుంటారని ఏమేమో మాటలు చెబుతారని వారు చెప్పే మాటలకు ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 14 సంవత్సరాల పాటు పోరాటాలు చేస్తే కానీ 2014లో కెసిఆర్ పుణ్యమా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. గతంలో కరెంటు తిప్పలతో రైతులు, ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారని, ఆ బాధలను చూసి కెసిఆర్ 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆగంకాకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటెసి ఖానాపూర్ ఎమ్మెల్యేగా బుక్య జాన్సన్ నాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్నారు. జాన్సన్‌ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకొని సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా తయారు చేస్తానని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికి రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులకు రూ. 73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని, ఈసారి అధికారంలోకి రాగానే 5 లక్షల బీమా కల్పిస్తామని, సౌభాగ్యలక్ష్మిపేరుతో ప్రతీ మహిళకు 3 వేలు ఇస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తామన్నారు.
అదే విధంగా రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల రైతు బీమా రైతు కుటుంబానికి అందిస్తున్నామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోకుండా అభివృద్ధ్ది చేసే బిఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని, యాజమాన్య హక్కులు వస్తే వాటిని అమ్ముకోవడంతో పాటు పిల్లలకు ఇచ్చుకోవడం, అలాగే బ్యాంకులో కుదవ పెట్టుకోవచ్చన్నారు. రైతుబంధును రూ. 16 వేలకు పెంచుతామని, వంట గ్యాస్ సిలిండరు రూ. 400 రూపాయలకే అందజేస్తామన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరిస్తామన్నారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో పాటు జన్నారంలో సెంట్రల్ లైటింగ్, ఐటీఐ భవనంకు నిధులు, 132 కేవీ సబ్ స్టేషన్, కవ్వాల్ టైగర్‌జోన్ ఆంక్షలను ఎత్తివేసి అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్‌తో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్‌నేత, చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్,
మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, ఏపీపీఎస్‌సీ మాజీ సభ్యులు పైడిపెల్లి రవిందర్‌రావు, బాదావత్ పూర్ణచందర్ నాయక్, జన్నారం ఎంపిపి మాదాడి సరోజన, జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, జిల్లా మండల నాయకులు సుతారి వినయ్‌కుమార్, మున్వర్ ఆలీఖాన్, మహ్మద్ రియాజోద్దీన్, జాడి గంగాదర్, సీలం రమేష్, జల్లె భీమయ్య, కమ్మల విజయధర్మ, ఎం తిరుపతి, జక్కు భూమేష్, చులువ జనార్దన్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, సీపతి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.