Monday, January 20, 2025

కెసిఆర్ గొంతు నొక్కేందుకు దండు కట్టిండ్రు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: తెలంగాణా కోసం పరితపించే ఒక్క కెసిఆర్ గొంతు పిసికేందుకు ఇంత మంది వస్తున్నారని, అయినా భయపడేది లేదని, సింహమెప్పుడూ సింగిల్ గానే వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి పురపాల క శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సంగారెడ్డి అభ్యర్థి చింత ప్రభాకర్‌కు మద్దతుగా ఆయన గంజ్ మైదాన్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. ప్రధా ని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, 15 మంది సి ఎంలు, కేంద్ర మంత్రులుఒక వైపు…సోనియా గాంధీ,రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ,కర్ణాటక సిఎం సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌లు మరో వైపు కెసిఆర్‌ను ఓడిద్దామని చూ స్తున్నారని, తెలంగాణా ప్రజలే కెసిఆర్‌ను కాపాడుకుంటారని, డిసెంబర్ మూడో తేదీ నాడు వంద స్థానాల్లో గెలిపించు కుంటారన్నారు. 55 ఏండ్లు పాలించిన సన్నాసులు  మోసం చేయడమే కాకుండా..మళ్లీ ఒక్క అవకాశం అంటూ అడుక్కుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణాలో గెలిస్తే…ఇతర రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతారన్న భయంతో అటు ప్రధాని మోడీ, ఇటు కాంగ్రెస్ రాహుల్‌గాంధీలు భయపడుతున్నారన్నారు.

అందుకనే బి టీమ్ పేరుతో కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఒక్క అవకాశమంటూ బిజెపి నేతలు పాకులాడుతున్నారన్నారు. అడ్డమైన సన్నాసులు కారుకూతలు కూస్తున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. 24 గంటల కరెంటు ఎక్కడ ఉన్నదంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ అడుగుతున్నారని, ఒక ఏసి బస్సు పెట్టి, ధమ్ బిర్యానీ ఇస్తామని తీగలు పట్టుకుని చూడాలని, దెబ్బకు రేవంత్, జగ్గారెడ్డిల దరిద్రం వదిలిపోతుందని అన్నారు. సంగారెడ్డిలో గెలిచి, బిఆర్‌ఎస్‌లో చేరతానని ఇక్కడి జగ్గారెడ్డి అంటున్నారంట…అలాంటోనికి ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు. పాలిచ్చే బర్రెను వదిలి..పొడిచే దున్నపోతును తెచ్చుకుంటామా అని ప్రశ్నించారు. గల్లీకో ఎటిఎం ఏమయింది? 40వేల మందికి ఇంటి స్థలాలు ఏమయ్యాయి? 500 అదనపు పింఛన్ ఏమయిందో జగ్గారెడ్డినే అడగాలన్నారు. ఈసారి మళ్లీ మాటలు నరుకుతాడని, నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతారన్నారు. ప్రజలకు అందుబాటులో లేనోడికి,ఉద్యమంలో లేనోడికి ఓట్లు అవసరమా ? అని అన్నారు. కాంగ్రెస్ కావాల్నా? కరెంట్ కావాల్నా? అని ఆయన అడిగారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది..కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు.

అక్కడి రైతులు సబ్‌స్టేషన్ల వద్దకు మొసళ్లను తెస్తున్నారని, విద్యుత్ ఉద్యోగులపైకి వదిలిపెడుతున్నారని తెలిపారు.సంగారెడ్డికి మెట్రో రావాలన్నా…ఐటి హబ్ రావాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఎన్నికలప్పుడు గంగిరెద్దుల్లాగా చాలా మంది వస్తారని, వారిని చూసి ఆగం కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చింత ప్రభాకర్ లాగా పని చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 2014లో ఆశీర్వదించారని, ఈసారి కూడా అలాగే ఆదరించాలని చింత ప్రభాకర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నానని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తుందన్నారు. సిఎం కేసీఆర్ ఆచరిస్తే…దేశమంతా అనుకరిస్తుందన్నారు. కెసిఆర్ గుణాత్మక మార్పు తెచ్చారని, మూడోసారి రాష్ట్రంలో అధికారం సాధిస్తారన్నారు. రాష్ట్రమంతా సంగారెడ్డి వైపు చూస్తుందన్నారు. ప్రాణమున్నంత వరకు మీతోనే ఉంటానని పేర్కొన్నారు. ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంగారెడ్డి పౌరుషాన్ని చాటి చెప్పాలని, ఓట్టేయించుకుని అడ్రస్ లేకుండా పోయే వారిని నమ్మరాదన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటే చింత ప్రభాకర్‌నే ఆదరించాలన్నారు.

పార్టీ నేతలు డిసిసిబి వైస్ ఛైర్మన్ మాణిక్యం, టిఎన్‌జిఓ సంఘం మాజీ నేత రాజేందర్, జిల్లా గ్రంథాల సంస్థ ఛైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మందుల వరలక్ష్మి, విజేందర్‌రెడ్డి, బొంగుల విజయలక్ష్మిరవి, శివరాజ్‌పాటిల్, ఆత్మకూర్ నగేష్, ఎం. హకీం, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి, ప్రభుగౌడ్, పిల్లోడి విశ్వనాథం, మధుసూదన్‌రెడ్డి, చీల మల్లన్న,సునీతామనోహర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, నర్సిములు, ఖాజా ఖాన్, పద్మావతి, బీరయ్య యాదవ్, మాణిక్య ప్రభు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News