Wednesday, January 22, 2025

లక్ష మందికి శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్‌ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని ప్రతి రోజు సగటున 4వేల మంది చనిపోతున్నారని అన్నారు. కార్డియాక్ అరెస్టు ఎవరికైనా రావొచ్చని.. దానికి సమయం, సందర్భం ఉండదని పేర్కొన్నారు. ఇలా చనిపోతున్న వారి సంఖ్యను కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) ప్రక్రియ చేపట్టడం ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. అందుకే ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే సిపిఆర్ శిక్షణ తీసుకొచ్చామని తెలిపారు. సిపిఆర్ ప్రక్రియను విజయవంతం చేస్తే ప్రతి 10 మందిలో ఐదుగురిని బతికించవచ్చని డబ్ల్యూహెఒతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి 24 వేల మంది చనిపోతున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని జివికె ఇఎంఆర్‌ఐ కేంద్రంలో సిపిఆర్ శిక్షణను మంత్రులు కెటిఆర్, మల్లారెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు శావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల సిపిఆర్ చేసి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్, వైద్యాధికారి వెంకటరమణలను మంత్రి హరీశ్ రావు, కెటిఆర్ సన్మానించారు. లక్షలాది ప్రాణాలు కాపాడే ఒక మంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. కొన్ని సార్లు గుండె స్పందించదని, ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డెఫిబ్రిలేటర్స్(ఎఇడి) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందని వివరించారు.

రూ.18 కోట్లతో 1200 ఏ.ఈ.డీ పరికరాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి ఉంచుతామని తెలిపారు. సిపిఆర్ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీస్ ఉండే వారికి కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. గ్రామ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. సిపిఆర్ శిక్షణ ఆలోచన మంత్రి కెటిఆర్‌ది అని, వారి మామగారు చనిపోయినపుడు అక్కడికి వెళ్తే చెప్పారని అన్నారు.

సిపిఆర్ తెలిసిన వారు లేక వారి మామగారు ప్రాణాలు కొలోయారని, ఈ విషయం తెలిసిన తర్వాత తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పారు. అప్పుడు జరిగిన చర్చలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని అనుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
సకాలంలో సిపిఆర్ చేస్తే చనిపోయే వారి సంఖ్య తగ్గించవచ్చు
సకాలంలో సిపిఆర్ చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్ మీడియా, టివిల్లో చూస్తున్నామని, ఇవి సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులే అని పేర్కొన్నారు. సిపిఆర్ తెలిసిన వారు ఉంటే సిపిఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. సిపిఅర్ శిక్షణ విస్తృతంగా చేస్తే కనీస సగం మంది ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సిపిఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు, వయస్సుతో సంబంధం లేదని మంత్రి అన్నారు. కొంత అవగాహన, కొంత సమయ స్ఫూర్తి ఉంటే ఎవ్వరైనా సిపిఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఈ శిక్షణ విస్తారించలన్నదే ప్రభుత్వం ప్రయత్నమని పేర్కొన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోవడం చూస్తే మనసు కలిచి వేస్తున్నదని అన్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలు గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని చెప్పారు. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్స్‌కి గురవుతారని, ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వచ్చి గుండె లయ తప్పి ఆగిపోతుందని వివరించారు. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె, ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయని దీనినే సిపిఆర్ అంటారని వివరించారు.

రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయితే, అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ రాజశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడారని చెప్పారు. అలాగే ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చేందుకు వరంగల్ కలెక్టరేట్‌కు వచ్చి, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తక్షణం స్పందించి సిపిఆర్ చేసి ప్రాణం కాపాడారని తెలిపారు. వీరిద్దరి ఇద్దరు ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్‌లు జిల్లాల్లో కలెక్టర్ల అధ్వర్యంలో అన్ని శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచన చేసి సిపిఆర్ ట్రైనింగ్ ప్రారంభించారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యం రంగాన్ని పటిష్టం చేయడంతో పాటు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ప్రజలు మంచి ఆహార అలవాట్లు, జీవన శైలిని కలిగి ఉండటంతో పాటు శారీరక, మానసిక ఉల్లసాన్నిచ్చే వాకింగ్, వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఇటీవల సోషల్ మీడియాలో చూశా: మంత్రి కెటిఆర్
గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతే కష్టమని.. అలా రక్తప్రసరణ అందక అనేక మంది యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగకుండా ఉండేందుకే సిపిఆర్ శిక్షణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి సిపిఆర్ శిక్షణ ఇవ్వాలని మంత్రి కెటిఆర్ సూచించారు. జిల్లాల్లో కూడా వందల మందికీ శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇటీవలి కాలంలో అనేకమంది సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోవడం సామాజిక మాధ్యమాల్లో చూశానని తెలిపారు. 19 ఏళ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆ ప్రదేశాల్లో సిపిఆర్ శిక్షణ పొందిన వారు ఉండి ఉంటే వారి ప్రాణాలను కాపాడేవారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ బ్రహ్మాండంగా ముందుకు పోతోందని కెటిఆర్ అన్నారు. వైద్య రంగంలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారాలని ఆకాంక్షించారు.

ప్రాథమిక స్థాయిలో బస్తీదవాఖానాలు మొదలుకుని, సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళ వరకు ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. టీ డయాగ్నొస్టిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందని చెప్పారు. ఆసుపత్రి ప్రసవాలు పెరగడం, మాతా శిశు మరణాలు వంటి సూచిల్లో మనం మెరుగు పడడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో సంవత్సరానికి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకుంటారు.. కానీ మన దగ్గర మాత్రం ఆరోగ్య సమస్య వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శారీరక శ్రమ తగ్గడం, జీవన శైలి మారడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగాయని, మన దేశం ఇప్పుడు డయాబెటిస్ హబ్‌గా మారిందని తెలిపారు. గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహన లేకపోవడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు.

ఇటీవల తన మామ కూడా గుండె పోటుతో మరణించారని, మంత్రి హరీష్ రావుతో ఓ సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడితే.. సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేద్దామని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా డి-ఫైబ్లేటర్స్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావును కోరారు. సంవత్సరానికి 5 ప్రాణాలు కాపాడినా.. 5 కుటుంబాలను కాపాడినట్టే అని పేర్కొన్నారు. ఈ విషయంలోనూ తెలంగాణ భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శంభిపూర్ రాజు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జివికె ఇఎంఆర్‌ఐ డైరెక్టర్ కృష్ణం రాజు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News