- Advertisement -
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు ఈనెల 29న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు గులాబీ దండు కదిలితే ప్రతిపక్షాల గుండె అదరాలి అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. ఓ వైపు పరిపాలన, సంక్షేమం.. మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు మన అభివృద్ధి కనిపిస్తుంటే.. మన పక్కనే ఉన్న నేతలకు కనిపించడం లేదని మండిపడ్డారు. బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఈ ఏడాదికి మన పార్టీకి 20 ఏండ్లు నిండాయని, దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 20 ఏండ్లు నిలదొక్కుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఆషామాషీ కాదని మంత్రి అన్నారు.
1971లో 14 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 11 మంది తెలంగాణ ప్రజా సమితి పార్టీ నుండి గెలిచారని, కానీ విధిలేక కాంగ్రెస్‌లో కలిసిపోవాల్సి వచ్చిందన్నారు. 2001లో ఉద్యమ బిడ్డగా వచ్చిన సిఎం కేసీఆర్ తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. మొట్టమొదటి పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవ తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే ఇచ్చింది గుర్తు చేశారు.
బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు
వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు బండి సంజయ్ తన పాదయాత్రలో బ్రాండ్ అంబాసిడర్ లాగా కనిపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు ఇస్తున్నారా?, గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారా?, హరితహారం వంటి పథకాలు ఉన్నాయా? అని మంత్రి ప్రశ్నించారు. మన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని, రైతుల కోసం కేసీఆర్ చేసిన పనులు ఎవ్వరూ చెయ్యలేదని చెప్పారు. పంట పెట్టుబడి, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ మాత్రమే చేశారు కెటిఆర్ పేర్కొన్నారు.
Minister KTR Speech at Kamareddy
- Advertisement -