Saturday, January 11, 2025

స్కీములు కావాలా..స్కాములు కావాలా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాలలో కారు కావాల్నా..బేకారుగాళ్లు కావాల్నా..మనకు ఐటీ హబ్ కావల్నా..పేకాట క్లబ్ కావాల్నా..మీకు స్కీములు కావాల్నా…లేక స్కాములు కావల్నా..24 గంటల కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా. లేక మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా..వందల మందిని పొట్టన పెట్టుకున్న దారుణమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చే బాధ్యత మీదేనని శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంచిర్యాల మనుషులు మంచి మనసు గల వారని, అలిగిన, గులిగినా మనోడు మనోడు అని, కారు గుర్తుకు ఓటు వేసి మంచిర్యాల శాసన సభ్యుడిగా దివాకర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మంచిర్యాల సిఎం కేసీఆర్ జిల్లాగా అభివృద్ధి చేశారన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని వందల మందిని పొట్టన పెట్టుకుందన్నారు. కరెంటు కష్టాల గురించి కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని మంత్రి ఎద్దేవ చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మంచిర్యాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని, గోదావరి వరకు నీరు కాలనీలోకి రాకుండా కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఒక కెసిఆర్‌ను ఎదుర్కొనేందుకు దేశంలోని పెద్ద నేతలు రాష్ట్రానికి దిగుతున్నారని, అయినా మేము వాళ్లకు భయపడమన్నారు. సింహం సింగిల్‌గానే పోరాడుతుందని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. మేం రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నాం, కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ నేతల చేతుల్లో పెట్టదని, రాష్ట్రం ఆగమవుతుందన్నారు. కాంగ్రెస్ కాలంలో జూనియర్, డిగ్రీ కాలేజీలు కావాలని ధర్నాలు చేయాల్సిన పరిస్దితి ఉండేదని కాని సిఎం కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలు కాకుండా ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల కూడా రాష్ట్ర మంత్రులు తీసుకువచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కెసిఆర్‌ది. అలాగే మంచిర్యాల జిల్లాకు ఈ మధ్యనే మెడికల్, నర్సింగ్ కాలేజీలు తీసుకురావడం జరిగిందన్నారు. ఇక మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా అమ్మేసుకునే పరిస్థితి వస్తుందని, మంచిర్యాలను పేకాట క్లబ్‌గా మారుస్తారన్నారు.

కాంగ్రెస్ హయాంలో పెన్షన్లు అంతంత మాత్రంగా ఉండేవిని, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి దొడ్డు బియ్యం అందేవి కాని కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం, అలాగే పెన్షన్లను పెంచడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం వచ్చినట్లయితే సౌభాగ్యలక్ష్మి పథకం కింద మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళకు అందించడం జరుగుతుందన్నారు. రైతు బీమా అనేది కూడా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఐదు లక్షల వరకు బీమా అందజేయడం జరుగుతుందన్నారు. మరోసారి తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, మంచిర్యాలలో దివాకర్‌రావు గెలుపు మీ చేతుల నుంచి గెలిపిస్తారని, నమ్మకం ప్రజల మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇన్‌చార్జి ఎమ్మెల్యే భాను ప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి,

బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచిర్యాలలో ఐటీ హబ్, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే దివాకర్‌రావు
ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల అభివృద్ధి పథంలో నడుస్తుందని, రోడ్లు, ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, తదితర అభివృద్ధి పనులు చేపట్టిందని, అలాగే మంచిర్యాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చిన విధంగానే ఇంజనీరింగ్ కళాశాల కూడా తీసుకురావాలని మంత్రిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News