Saturday, November 16, 2024

వికారాబాద్‌కు కృష్ణా నీటిని తెచ్చే బాధ్యత మాదే:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాకు సాగునీటిని తెచ్చే బాధ్యత మా ప్రభుత్వాన్నిదేనని మంత్రి కెటిఆర్ అన్నారు. ఒక్క కెసిఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ నేతలంతా ఏకమవుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం వికారాబాద్, మర్పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి లతో కలిసి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరుతున్నారని కానీ కాంగ్రెస్ పాలకులకు ఒక్క అవకాశం కాదని 11సార్లు అవకాశం ఇచ్చారని 55ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాలంలో కరెంటు ఉంటే వార్త అని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అని అన్నారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ రైతులకు ఐదు గంటల నిరంతర విద్యుత్తు అందిస్తామని అంటున్నారని కాని తెలంగాణలో 24 గంటల విద్యుత్తు సరఫరా అవుతుండగా ఐదు గంటలు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో కరెంటు ఎక్కడ ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లి కరెంటు తీగల పట్టుకున్నా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కరెంటు తీగలను పట్టుకుంటే కరెంటు ఉందో లేదోనని తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు కరెంట్ తీగలు వరుసగా నిలబడి పట్టుకుంటే తెలంగాణకు దరిద్రం పోతుందని ఎద్దేవా చేశారు. నాయకులు అధికారులు గ్రామాలకు వస్తే ఖాళీ బిందెలతో ప్రజలు ఎదిరించే వారిని నేడు ఆ పరిస్థితి లేకుండా సిఎం కెసిఆర్ ప్రతిఇంటికి తాగునీటిని అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కాలంలో కరెంటుతో అరిగోస పడ్డామని, ఆ సందర్భాలు మర్చిపోయామా..? అన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క జూనియర్ కళాశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ మెడికల్ కళాశాల కానీ తీసుకువచ్చిందా అని ప్రశ్నించారు.

వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేసింది కాక మెడికల్ కళాశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను తీసుకువచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గ్రామాలకు వచ్చి గాయ్‌గాయ్ చేస్తారని అటువంటి మాటలను ప్రజలు నమ్మవద్దని ప్రజా సంక్షేమాన్ని అమలు చేసే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ మెతుకు ఆనంద్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కృష్ణనీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించకుండా కేసులు వేసి ఆపిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. రెండు సంవత్సరాలపాటు కరోనాతో ఇబ్బందులు పడ్డామని ఆ తర్వాత అభివృద్ధిని వేగంగా చేసుకుంటున్నామని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ. 12,000 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం మనదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాలుగు కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. రైతుబంధు రైతుల అకౌంట్లో పడుతుంటే సెల్ ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతున్నాయని అన్నారు.

వికారాబాద్ చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి తానే వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్లుగా కష్టపడుతున్నారని, అందరూ పెద్ద మనసుతో బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి కావాలంటే బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని గ్రామాలకు తిరిగి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించామని, ప్రభుత్వపరంగా వచ్చిన చెక్కులను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ వివిధ పథకాల సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి వారి ఇంటికి దళారుల పాలు కాకుండా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వికారాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News