హైదరాబాద్ ః రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలకు వెన్నుముక లేదని మంత్రి కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమి కొట్లాడుతున్నారని, పసుపుబోర్డు సాధించారా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నలభై శాతం ఫార్మా ఉత్పత్తులు చేసే తెలంగాణకు ఏమి సాయం చేయకుండా పెట్టుబడులను గుజరాత్, యూపిలకు కేంద్రం తరలిస్తుందని ఆయన విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్‌ను పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దళితబంధు పథకంతో విప్లవాత్మమైన మార్పులు తీసుకొచ్చామన్నారు.
కేంద్ర ప్రభుత్వం చిరువర్తకులకు ముద్రలోన్ కింద ఇచ్చే రూ. 10వేల రుణంలో గ్రాంట్ లేదన్నారు. ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీతో ఎన్ని సంస్థలను కేంద్రం ఆదుకుందని ఆయన ప్రశ్నించారు. ఆ పథకం వలన కనీసం 20 మందికి కూడా ప్రయోజనం జరగలేదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కేంద్రానికి దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం 163 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మిందని ఆయన ఆరోపించారు. దీనివలన 9 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పారు. అందులో 1లక్ష63 వేల 99 మంది దళిత గిరిజనులు, 1 లక్ష ఒబిసిలు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని ఆయన వెల్లడించారు. పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలకు రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని ఆయన దుయ్యబట్టారు.