కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: జిఎస్‌టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. వస్త్రపరిశ్రమై జిఎస్‌టి పెంపు విషయమై ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం.. స్వదేశంలో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమకు సహకారం అందించాల్సింది పోయి జిఎస్‌టిని 5 నుంచి 12 శాతానికి పెంచారని ఆక్షేపించారు. జాతీయ చేనేత దినోత్సవం రోజు.. చేయూతనిస్తామన్న ప్రధాని మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని నేతన్నలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ద్వందవైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు ఒక నిబంధన.. దక్షిణాదికి మరో నిబంధనా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో వున్నవారు ప్రజలను వేరుగా చూడటం విడ్డూరమని ఆక్షేపించారు.
వస్త్ర వ్యాపారం కనుమరుగయ్యే అవకాశం
మరోవైపు వస్త్ర వ్యాపారం కనుమరుగయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతుతున్నాయి. నిత్యావసరాల్లో ఒకటైన వస్త్రంపై పన్ను తగ్గించాల్సింది పోయి.. పెంచడం ఏంటి? అని వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే పన్నే అయినప్పటికీ వ్యాపార వర్గాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి. పెంచిన జిఎస్‌టిని తగ్గించాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక స్థోమత తక్కువ ఉన్న వారంతా రోడ్డునపడతారని టెక్స్‌టైల్ వ్యాపారాల సంఘం ఆందోళన వ్యక్తపరుస్తోంది. జిఎస్‌టి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
చేనేత పరిశ్రమకు దూరమైన 25 శాతం కుటుంబాలు
2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడగా.. తాజా గణాంకాల మేరకు ఆ సంఖ్య 30.44 లక్షల కుటుంబాలకు పడిపోయింది. అంటే దాదాపు 25 శాతం కుటుంబాలు చేనేత పరిశ్రమకు దూరమయ్యాయి. గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని ఒక పరిశ్రమగా కాకుండా, గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. చేనేత రంగంలో తక్కువ ఆదాయం, క్లిష్టమైన పరిశ్రమ కావడంతో కొత్త జనరేషన్ ఈ రంగానికి దూరమవుతోందని.. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే చేనేతరంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో ఈ రంగంలో పనిచేస్తున్న 67 శాతం కుటుంబాల ఆదాయం రూ.5 వేల కంటే తక్కువగా ఉందని, మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం రూ.10 వేల కంటే తక్కువని అంచనా. మొత్తం 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం పదివేలకు మించడం లేదన్నది తాజా గణాంకాలే వెల్లడి చేస్తున్నాయి.