చేనేతపై పన్నేసిన బిజెపిని మట్టుబెట్టాలి
నేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హీనచరిత్ర కేంద్రానిది పొదుపు, బీమా పథకాలను ఎత్తేసిన
దుర్మార్గుడు మోడీ నేతన్న బతుకులను ఆగమాగం చేస్తున్న కమలనాథులు ఉపపోరులో ఓటే ఆయుధంగా
బిజెపికి బుద్ధి చెప్పాలి మునుగోడు నేతన్నలతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్‌టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న బిజెపికి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కెటిఆర్, నేతన్నల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న నష్టాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని నేతన్నలకు కొత్త గుర్తింపు, గౌరవం లభించిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదకి 1200 కోట్ల రూపాయల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తూ వస్తున్నామని ఈ సం దర్భంగా కెటిఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధం గా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని, నేతన్నకు చేయూత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా కోవిడ్ సంక్షోభ కాలంలో సుమారు రూ.100 కోట్లను రాష్ట్రంలోని నేతన్నలకు కాలపరిమితి కన్నా ముందుగానే అం దించిన ప్రభుత్వం మాదని కెటిఆర్ తెలిపారు.
నేత కార్మికులకు జరిగిన భారీ లబ్ధి నేపథ్యంలో మరోసారి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం ఐదు లక్షల బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. లక్ష రూపాయల వరకు చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడం ద్వా రా 10,500 మందికి లబ్ది కలిగిందన్నారు. నారాయణపేటలో సమీకృత చేనేత అభివృద్ధి కేంద్రంతో పాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యిక్రమాలను చేపడితే మరోవైపు కేంద్రం మాత్రం నేతన్నలపైనే కక్ష కట్టిందని కెటిఆర్ అన్నా రు. దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేనేత వస్త్రాల పైన పన్ను వేయలేదని, కానీ ప్రస్తుత బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం జిఎస్‌టి వేశారన్నారు. ప్రస్తుతమున్న ఐదు శాతం జిఎస్‌టిని 12 శాతానికి పెంచే కుట్రలను సైతం బిజెపి చేస్తుందని కెటిఆర్ అన్నారు.
స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్భుతమైన వారసత్వంగా నిలిచిన చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథక, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి అన్ని కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేని చేనేతల పట్ల మోడీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తుందని కెటిఆర్ అన్నారు. చేనేతలకు గతంలో ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై చావు దెబ్బ కొట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయం అడిగితే ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం మొండి చేయినే చూపించిందన్నారు.
నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్సోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి విషయాల్లోనూ కేందర ప్రభుత్వం నుంచి నిరాశనే ఎదురయిందన్నారు. ఇలా అన్ని రంగాల్లో చేనేత కార్మికుల జీవితాలను చీకట్లలోకి తోస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఆయన పార్టీ బిజెపికి మునుగోడు ఉప ఎన్నిక ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కెటిఆర్ మునుగోడు నేతన్నలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుపల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాలలో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం, కుంట్లగూడెం ప్రాంతాలకు చెందిన స్థానిక సమస్యల పరిష్కారానికి కెటిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు మరింత బలంగా కొనసాగాలంటే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న కెటిఆర్, నేతన్నల భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మారుస్తున్న బిజెపికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్త చేశారు.