మనతెలంగాణ/హైదరాబాద్:ఐటి రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాప్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను మంత్రి కెటిఆర్ ప్రారంభించగా నిజామాబాద్ హబ్‌ను బుధవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఐటీ ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ మాత్రమే అనుకునేవారు. కానీ, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
అందులో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను నిర్మించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఐటీ టవర్‌లలో పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వేల మంది యువత ఉపాధి పొందుతున్నారు. ఈ ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలకు ముందుకు వస్తున్నాయి. ఐటీ రంగాన్ని మరింత విస్తరించే క్రమంలో తాజాగా నిజామాబాద్‌లోనూ ఓ ఐటీ హబ్‌ను ప్రభుత్వం నిర్మించింది.
ట్వీట్‌లో పేర్కొన్న మంత్రి కెటిఆర్
నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం రోజున ప్రారంభించనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్‌ను ప్రారంభించబోతున్నా. ఈ టవర్‌లో టి హబ్, టాస్క్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇవి యువత ఆవిష్కరణలు చేసే దిశగా వారికి ప్రోత్సాహం అందించనున్నాయని కెటిఆర్ ట్వీట్ చేశారు.
280 మందికి నియామక ఉత్తర్వులు
నిజామాబాద్ ఐటీ హబ్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి ఎమ్మెల్సీ సోమవారం సందర్శించారు. 750 మంది పని చేసే సామర్థ్యంతో ఐటీ టవర్‌ను నిర్మించామని ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఇటీవల ఉద్యోగ మేళాలో 280 మందికి ఆయా కంపెనీలు నియామక ఉత్తర్వులు ఇచ్చాయన్నారు. 200 మంది ఉద్యోగాల్లో చేరేందుకు సంసిద్ధత తెలిపారని ఆమె పేర్కొన్నారు. వికలాంగ అభ్యర్థులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వ్ చేశామని వివరించారు.
ఈ టవర్‌లో స్పేస్ కోసం అమెరికా కంపెనీల ఆసక్తి
బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేశ్‌బిగాల
ఇప్పటికే ఈ ఐటీ టవర్‌లో 75 శాతం సీటింగ్‌ను ప్రముఖ కంపెనీలు బుకింగ్ చేసుకున్నాయి. దీనికోసం ప్రముఖ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఎక్కువగా అమెరికాకు చెందిన కంపెనీలు ఈ టవర్‌లో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ టవర్ ప్రారంభం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలకు కొదువ ఉండదు. ప్రతినెలా ఇక్కడ జాబ్‌మేళా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత, మంత్రి కెటిఆర్‌లు నిర్ణయించారు. ఈ జాబ్‌మేళాలో అమెజాన్, హెచ్‌డిఎఫ్‌సి, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబిఏం వంటి 52 అంతర్జాతీయ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.