Saturday, November 23, 2024

రేపు కోకాపేట ఎస్టీపీని ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జలమండలి నూతనంగా నిర్మించిన కోకాపేట మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిని జలమండలి ఎండీ దానకిశోర్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. కోకాపేట ఎస్టీపీని ప్యాకేజీ-2 లో భాగంగా 15 ఎంఎల్డీల సామర్థ్యం, ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని మురుగు శుద్ధి చేయవచ్చు. విద్యుత్తు వినియోగం సైతం తక్కువగా ఉంటుంది. ఈ ఎస్టీపీ అందుబాటులోకి వస్తే వట్టినాగుల పల్లి, తాజ్ నగర్, జర్నలిస్టు కాలనీ, గౌలి దొడ్డి, ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల నుంచి ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు.

దీని నిర్మాణానికి మొత్తం రూ.66.16 కోట్లు ఖర్చయ్యాయి. మహా నగరంలో వంద శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నూతన 31 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న25 సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పన్నమయ్యే మురుగును వంద శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ నిలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News