Monday, December 23, 2024

రేపు ములుగు జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

ములుగు : ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9గంటల 30 నిముషాలకు బేగంపేట నుంచి కెటిఆర్ బయలుదేరి 10.15 నిమిషాలకు ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి చేరుకుంటారు. అనంతరం ములుగు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి రూ. 65 కోట్ల నిధులతో శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా రూ.38 కోట్ల 50లక్షలతో జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీసుల నివాస భవన రూ.10కోట్ల 4 లక్షలతో స్థిర నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

అంతేకాకుండా రూ.1కోటి 25లక్షలతో నిర్మించనున్న న్యూమోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు, రూ.50లక్షలతో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణ పనులు, కోటి రూపాయలతో మేడారం శాశ్వత ప్రాతిపదికన రూ.10కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. అదే విధంగా ములుగు జిల్లా కేంద్రంలో రూ.30 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి, రూ.12కోట్ల 5లక్షలతో ఐదు మండలాల్లో నూతన పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలతోపాటు ఇంకా అనేక అభివృద్ధి పనులకు కెటిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కెటిఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్ పక్కన నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ పనులను మంగళవారం పరిశీలించారు.

అనంతరం సభ నిర్వహణపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. పాలంపేట రామప్ప చెరువు వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి విచ్చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలుపుతున్నామన్నారు. రామప్పలో ఇరిగేషన్ డే గోదావరి జలాలకు పూజలు చేయనున్నారని తెలిపారు. రామప్ప రిజర్వాయర్ పూర్తయిన నేపథ్యంలో ఇరిగేషన్ చెరువుల ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కిన రామప్ప ఆలయంలో కెటిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్ పక్కన ప్రాంగణంలో బహిరంగ సభలో ఐకెపి మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీతో పాటు గొల్ల కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణీ 125 యూనిట్లు పంపిణీ చేస్తారని ఆమె పేర్కొన్నారు. రూ.150కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు రూ.200 కోట్లతో లబ్ధిదారులకు వివిధ పథకాలను పంపిణీ చేయనున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, రెడ్‌కో చైర్మన్ సతీష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్, ఎంపిపి శ్రీదేవి, జడ్పిటిసి భవాని, బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News