మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే అని ఐటి, పురపాల క శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లి గ్రామంలో సోమవారం ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యం లో మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, స్థానిక ఎంఎల్‌ఎ రాజయ్యల నేతృత్వంలో మంత్రి కెటిఆర్ రూ.125 కోట్లతో పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు. మంత్రి కెటిఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్ర భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మండలి డి ప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్, ఘన్‌పూర్ మండలాలకు సంబంధించిన సాగు, తాగునీటి కోసం మూడు లిఫ్ట్‌లకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని అందులో భాగంగానే వేలేరులో ఒక్కరోజులోనే రూ.125 కోట్ల పనులను చేసుకోవడానికి నిధులను వెచ్చించామంటే అది తెలంగాణ సాధించుకున్న పుణ్యమేనన్నారు. నియామకాల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తరువాత 2 లక్షల 21 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు, తాగునీటి కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల ద్వారా చెరువులు, పూడికలు తీసి నీరు సమృద్ధిగా ఉండేవిధంగా చెరువులను బాగు చేసుకున్నామని ఇంటింటికి నల్లాలు ఇచ్చి ఆడపడుచు బిందె పట్టుకొని బయటకు పోయే పరిస్థితి లేకుండా చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం వల్ల నేడు రెండు పంటలకు డోకా లేకుండా పోయిందన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లను కేటాయించి పనులను తుది దశకు తీసుకువచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.
దాని ఫలితమే వరంగల్, సిద్ధిపేట జిల్లాల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు. ఇవన్నీ తెలంగాణలో నడుస్తున్న అభివృద్ధి అయితే పనికిమాలిన వాళ్లు పాదయాత్రలు చేస్తూ చంద్రునిలో మచ్చలు వెతికే పనిలో ఉన్నారని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్కసారి కాదు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 50 ఏళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే ప్రజలను కరెంటుకు, తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు అధికారం కావాలంటే ప్రజలు ఇచ్చే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకుండా పోయిందన్నారు. ప్రధాని మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చి ఆదానీ ఆదాయాన్ని రెట్టింపు చేశారన్నారు. రైతుల కోసం తపన పడినట్లు మోడీ ముసలికన్నీరు కార్చి ఢిల్లీ పక్కన రైతులను రెండు సంవత్సరాల పాటు రోడ్లపై పడుకోబెట్టి వారిపై దమనకాండకు పూనుకున్న విషయం రైతులు ఇంకా మరిచిపోలేదన్నారు.
తెలంగాణలోని రైతులు రెండు పంటలు పండిస్తూ నేడు పంజాబ్, హర్యానా రైతులతో పోటీ పడుతూ దేశంలోనే తెలంగాణ రైతులు పంటల దిగుబడిలో పోటీ పడుతున్నారన్నారు. జన్‌ధన్ ఖాతాలను తెరిస్తే నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ మాటలు కళ్లబొల్లి మాటలు కాగా దేశంలోని సంపదనంతా ఆదానీ కంపెనీలకు పెట్టి ఒక్కన్నే సంపన్నుడిని చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ది కుటుంబపాలన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, నిజానికి కెసిఆర్‌ది నాలుగుకోట్ల ప్రజలతో కూడిన కుటుంబపాలనే అని అన్నారు. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేసి, 45 లక్షల మందికి రూ.2 వేల చొప్పున పెన్షన్ ఇస్తూ ప్రతిఒక్కరికీ ఆసరాగా మారిన పెద్దన్నగా కెసిఆర్ నిలిచారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో మేనమామగా, 975 గురుకులాలను స్థాపించి ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష 25 వేల వ్యయాన్ని వెచ్చించి విద్యనందిస్తున్న కెసిఆర్ విద్యార్థులకు పెద్దన్నగా నిలవడం కూడా కుటుంబపాలనేనన్నారు.
బండి సంజయ్ తొండి సంజయ్‌గా అబద్ధాలు మాట్లాడుతూ మతాలు, కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలను మోసం చేసిన మోడీని దేవుడంటున్న బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు ఏరకంగా దేవుడో చెప్పాలన్నారు. ములుగులో గిరిజిన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉపాధిహామీ నిధులను నిలిపివేయడం, మెడికల్, నవోదయ సంస్థలను తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వనందుకు ఏరకంగా దేవుడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న పరిపాలన అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెప్తున్నారని, కులాలు, మతాలతో తమకు సంబంధం లేదని తెలంగాణను అన్నిరంగాల్లో ముందుంచడమే ప్రధాన లక్షమన్నారు. ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
– కాబోయే ముఖ్యమంత్రి కెటిఆర్ : – కడియం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కెటి రామారావు అని మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్‌సి కడియం శ్రీహరి సభలో సంభోదించడంతో సభకు వచ్చిన 35 వేల మంది ప్రజలు హర్షద్వానాలతో కేరింతలు కొట్టారు. కెటిఆర్‌ను భావి ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి చెప్పగానే విశేషమైన స్పందన వచ్చినప్పటికీ మంత్రి కెటిఆర్ మాత్రం మౌనంగా చేతులు జోడించి నమస్కరించారు. ఇదిలా ఉండగా సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ రాజయ్య తదితరులు ప్రసంగించి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు, కొత్త మండలాలకు కావాల్సిన భవన సముదాయం, మౌలిక సదుపాయాలు, వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల తదితర వాటికి మంత్రి కెటిఆర్‌కు మంజూరు చేయాలని విన్నవించగా వాటికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ప్రీతి కేసులో నిందితులెవరైనా వదిలిపెట్టం
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాళ్లు సైఫ్ అయినా, సంజయ్ అయినా, ఎవరైనా సరే వదిలిపెట్టమని, చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలపై చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని కెటిఆర్ హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై చనిపోయిందని, ఆ అంశాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డామని, మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపి మాలోతు కవితలు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిం చారని మంత్రి తెలిపారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. కొంతమంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.