Friday, December 20, 2024

17న కొడకండ్లకు మంత్రి కెటిఆర్ రాక

- Advertisement -
- Advertisement -

వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపనకు ఈ నెల 17న ఐటీ, పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మంత్రి కేటీఆర్‌తో చర్చించి ఆయన సమయం తీసుకున్నారు. అనంతరం మంత్రి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే విధంగా కొడకండ్లలో సిరిసిల్ల తరహాలో టెక్స్‌టైల్ పార్క్‌ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చారు.

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కుకు సరిపడా స్థలాన్ని సేకరించడం జరిగిందని, ఆ స్థలంలో సిరిసిల్ల మోడల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. ఇప్పుడు కొడకండ్ల మినీ టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపనకు తేదీ కూడా ఖరారు కావడంతో ఏర్పాటు చేయాలని మంత్రి దయాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయని చెప్పారు. వలస వెళ్లే ఇక్కడి ప్రాంతాల ప్రజలు తిరిగివచ్చే అవకాశం ఉందని, వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో కొడకండ్ల రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆగస్టు నుంచి వరంగల్ టెక్స్‌టైల పార్కులో ఉద్యోగ అవకాశాలు…
వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పాలకుర్తి నియోజకవర్గంకు చెందిన, ఇటీవల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను వచ్చే ఆగస్టు నెల నుంచి కల్పించనున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు చెందిన పలువురు ప్రతినిధులతో చర్చించామని చెప్పారు. ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకుర్తి న్యిజకవర్గంలో మూడువేల మంది మహిళలకు

కుట్టు మిషన్‌లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి దయాకర్‌రావు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్‌టైల్ కమిషనర్ బుద్ద ప్రకాశ్, డైరెక్టర్ మెహర్, యంగ్ ఇండియా, కిటెక్స్ కంపెనీల ప్రతినిధులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News