Thursday, December 26, 2024

ఇదేంది మల్లన్న.. 9 యేండ్లకు 15 ఏళ్లు ఎలా పెరిగాయి

- Advertisement -
- Advertisement -

మల్లారెడ్డి అఫిడవిట్ తప్పుల తడక,  ఎన్నికల కమిషన్‌కు స్థానిక ఓటరు ఫిర్యాదు

మేడ్చల్/మన తెలంగాణ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మాల్లారెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, అఫిడవిట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాంపల్లి దాయారా గ్రామ నివాసి, స్థానిక ఓటర్ కందాడి అంజిరెడ్డి మేడ్చల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సోమవారం ఫిర్యాదు చేశారు. మాల్లారెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న తప్పులపై అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన అంశాలు..

2014లో చామకూర మాల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఇంటర్ విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాట్నిలో 1973లో పూర్తి చేసినట్లు తెలిపారు. 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఇంటర్ విద్యాభ్యాసం వెస్లీ కాలేజ్, సికింద్రాబాద్‌లో 1973లో పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం అంటే 2023 జనరల్ ఎలక్షన్స్‌లో మాత్రం రాఘవ లక్ష్మి దేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973లో ఇంటర్ విద్య పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఒకే సంవత్సరంలో మూడు కాలేజీల్లో చదివి ఇంటర్ విద్యాభ్యాసంను మంత్రి మాల్లారెడ్డి ఎలా పూర్తి చేశారో అర్థం కావడం లేదని, మాల్లారెడ్డి చర్యలు, తాను సమర్పించిన అఫిడవిట్ ఓటర్లను తప్పుదోవ పట్టించేలా వుందని, అసాధ్యమైన మంత్రి మాల్లారెడ్డి అబద్ధపు అఫిడవిట్ ను తిరస్కరించాలని కందాడి అంజిరెడ్డి కోరారు. అలాగే 2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో తన వయసు 56 సంవత్సరాలుగా పేర్కొన్న మంత్రి మాల్లారెడ్డి 2023లో మాత్రం తన వయసు 70 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అంటే 9 యేండ్లలో మాల్లారెడ్డి వయసు 15 సంవత్సరాలు ఎలా పెరిగిందో అర్థం కావడం లేదని అంజి రెడ్డి ఎన్నికల అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మాల్లారెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లోను ఆస్తుల వివరాలు తప్పుడుగానే ఇచ్చారని అంజిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News