హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ప్రముఖ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్‌ను కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి , రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు . గురువారం నూతన సచివాలయంలోని మంత్రి మల్లా రెడ్డి ఛాంబర్‌లోతండ్రితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాక్సర్ నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలియజేసిన మంత్రి మల్లా రెడ్డి ఇలాంటి వరల్డ్ ఛాంపియన్ షిప్‌లలో మరెన్నో గెలిచి ఇండియా తెలంగాణ పేర్లను నిలబెట్టాలని ఆకాంక్షించారు.
అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బంగారు పథకాలు సాధించాలని కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఆకాక్షించారు. నిఖత్ జరిన్ 50 కేజీల బాక్సింగ్ విభాగం లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ గా
రెండోసారి నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డితో అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే
రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహం అందించారు. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం కేటాయించింది. అనంతరం రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను నిఖత్ జరీన్ కలువగా ఆయన ఈ మేరకు శాలువా కప్పి ’ సత్కరించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రతిభ ను వెలుగులోకి తెచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ టోర్నీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.