Saturday, December 21, 2024

రేవంత్ బ్లాక్‌మెయిలర్

- Advertisement -
- Advertisement -

ఆయనది రచ్చబండ కాదు..లుచ్ఛా బండ :మంత్రి మల్లారెడ్డి

సిఎం కాదు కదా.. అటెండర్‌కూడా కాలేడు
ఆయన బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చింది నేనే
నేను పాలు అమ్మి డబ్బులు సంపాదించా.. రేవంత్ ఏమి చేసి సంపాదించాడు?
పైసలు ఇస్తావా.. కాలేజీలు మూయించాలా అని నన్ను బెదిరించాడు
ఖబడ్దార్ రేవంత్, నోరు జాగ్రత్త
దేశ్ కా నేత కెసిఆర్: మంత్రి మల్లారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడు రేవంత్ చేస్తున్నది రచ్చబండ కాదు…లుచ్చా బండ…బట్టేబాజ్ బండ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉంటే …ఆ పార్టీ రాజకీయంగా ఫినిష్‌యేనని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పట్టిందన్నారు. రేవంత్ సిఎం కాదు కదా….కనీసం అసెంబ్లీలో అటెండర్ కూడా కాలేడని ధ్వజమెత్తారు. మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఎంఎల్‌సి శంబీపూర్‌రాజ్, శాసనసభ్యుడు కెపి వివేకానందతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఆయన చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. రచ్చబండ పేరిట రేవంత్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏ పార్టీలో కూడా ఎక్కువ కాలం పని చేయరన్నారు. ఒకటి, రెండు రోజుల్లో రేవంత్ బిజెపిలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… జగ్గారెడ్డిలు అమాయకులన్నారు. రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడన్నారు. పదే పదే సిఎం కెసిఆర్‌ను…మంత్రి కెటిఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుడులు సాధించడం కోసం కెటిఆర్ దావోస్‌లో పర్యటిస్తుంటే….. రాహుల్‌గాంధీ మాత్రం పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్‌ల చుట్టూ తిరిగుతున్నారని ఆరోపించారు. అందరిని బ్లాక్ మెయిల్ చేసే అలవాటున్న రేవంత్…. రేపు రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారన్నారు. తాను పాలు అమ్మి, కష్టపడి ఆస్తులు సంపాదించానని…. మరి రేవంత్ ఏ పని చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు.

తన కాలేజీలు మూయిస్తానని బెదిరించాడు

టిడిపిలో ఉన్నప్పుడు తనను రేవంత్ రెడ్డి 24 గంటలూ బ్లాక్ మెయిల్ చేశారని మల్లారెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో ఎప్పుడు తమ మధ్య గొడవులు జరుగుతుండేవన్నారు. చివరకు తాను ఎంపీగా గెలిచిన తర్వాత కూడా రేవంత్ తన బ్లాక్ మెయిల్ ఆపలేదన్నారు. పైసలు ఇస్తావా? లేదంటే… కాలేజీలు మూసివేయించాలా? అని తనను బెదిరించారని మల్లారెడ్డి తెలిపారు.

రేవంత్ కూతురి వివాహానికి నేనే డబ్బులు ఇచ్చా

రేవంత్ కూతురి వివాహానికి డబ్బులు ఎవరు ఇచ్చారో ఆయన చెప్పాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బిడ్డ పెళ్లికి తాను డబ్బులు ఇచ్చానని మల్లారెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. రేవంత్ ది అంతా సినీ ఫక్కీ రాజకీయమని మండిపడ్డారు.

ఖబర్ధార్ రేవంత్….నోరు జాగ్రత్త!

ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి.. నోరు జాగ్రత్త! అని మల్లారెడ్డి హెచ్చరించారు. నన్ను పట్టుకుని ఆంబోతు అంటాడా! రేవంత్ ఒక చబుత్ర గాడు.. దొంగ రెడ్డి అని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో అన్ని కులాలను బాగా చూసుకుంటున్నాడన్నారు. తాను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నానని అన్నారు. ప్రభుత్వ భూమిని ఎక్కడా కొనలేదని… తీసుకున్నా మార్కెట్ రేటు కంటే ఎక్కువనే ఇచ్చానని అన్నారు. అందులో తప్పేముందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు సైతం భూములు కొంటున్నారు కదా అని ప్రశ్నించారు. కోర్టు సైతం తనకు అనుకూల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మల్లారెడ్డి గుర్తు చేశారు. తాను ఏర్పాటు చేసిన కాలేజీల ద్వారా ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్ల, ఫార్మాసిస్టులను తయారు చేశానని అన్నారు. మరి రేవంత్ ఏం చేశారని నిలదీశారు. ఆయన రక్తం పీల్చే సన్నాసిగా పేర్కొన్నారు. ఆయనను లీగల్‌గా ఎదుర్కొంటూ…జైలుకు పంపిస్తానని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.

దేశ్ కా నేత కెసిఆర్

తెలంగాణ మహాత్ముడిగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ త్వరలోనే దేశ్ కా నేత కాబోతున్నారని మల్లారెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు, కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలతో చనిపోయిన రైతు కుటుంబాలకు కెసిఆర్ ఒక్క పంజాబ్‌లోనే కాదు…దేశమంతా చెక్కులు పంచుతారన్నారు. ఈ దేశాన్ని కెసిఆర్ పాలించడం…ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. ఆయన ప్రధానిగా అయితే తెలంగాణలో ఇస్తున్న పథకాలు దేశమంతా అమలు చేస్తారన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడం కాంగ్రెస్ మొహాలకు తెలియదని మండిపడ్డారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశానని దివాళా తీయిస్తోందన్నారు. రెండు జాతీయ పార్టీలు విఫలం అయ్యాయని….ఇక ప్రత్యామ్నాయం కెసిఆర్ ఎజండానే అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News