మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎదురు దాడి
ముంబయి: ముంబయి క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు మహారాష్ట్రలో అధికార, ప్రతిక్ష నేతల మధ్య ఘాటు విమర్శలకు దారి తీస్తోంది. ఒకరు దీపావళి బాంబు అని, ఒకరు హైడ్రోజన్ బాంబు అని సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. మంగళవారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఫడ్నవిస్ గురించి నవాబ్ మాలిక్ అనేక విషయాలు వెల్లడించారు. దానిలో భాగంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ రియాన్ భాటి ఎవరు? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న భాటి నకిలీ పాస్‌పోర్టు కేసులో పోలీసులకు చిక్కాడు. కానీ రెండు రోజుల్లోనే అతడ్ని వదిలేశారు. ఫడ్నవిస్, బిజెపి పెద్దలు హాజరయ్యే వేడుకల్లో పలు సార్లు అతను కనిపించాడు. ప్రధానిని ఈ వ్యవహారంలోకి లాగదలచుకోలేదు కానీ ఆయనతో కూడా ఫొటోలు దిగేంత సంబంధాలున్నాయి.
ఫడ్నవిస్ ఠాణెలో నియమించిన పోలీసు అధికారులతో ఇతర దేశాల్లోని డాన్లు సంబంధాలు నెరిపారు. ఇదే కాకుండా తన హయాంలో నాగపూర్‌కు చెందిన నేరస్థుడు మున్నాయాదవ్‌ను రాష్ట్ర నిర్మాణ రంగ కార్మికుల బోర్డుకు చైర్మన్‌గా నియమించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన హైదర్ అజాం, మౌలానా ఆజాద్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడయ్యారు. అంతేకాకుండా 2016లో నోట్ల రద్దు(డీ మానిటైజేషన్) సందర్భంగా ఫడ్నవీస్ సహకారంతో నకిలీ కరెన్సీ రాకెట్ ఏ ఆటంకం లేకుండా సాగింది. ఆ సమయంలో సమీర్ వాంఖడే డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్( డిఆర్‌ఐ)లో పని చేస్తున్నారు’ అంటూ పలు ఆరోపణలు చేశారు. 1993 ముంబయి పేలుళ్ల కేసుతో మాలిక్‌కు సంబంధాలున్నాయని ఫడ్నవిస్ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాలిక్ దానికి కౌంటర్ ఇచ్చారు.
‘రోజూ అబద్ధాలు చెప్పడమే పని’
కాగా, మాలిక్ ఆరోపణలపై ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ స్పందించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం మాలిక్‌కు దినచర్యగా మారిందని, అందులో అబద్ధాలు మాత్రమే చెప్తారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తన వాళ్లను, నల్లధనాన్ని రక్షించుకోవడమే వాటి లక్షమని విమర్శించారు.