హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రైతుల పట్ల బిజెపి మొసలి కన్నీరు ఆపాలన్నారు. సిఎం కెసిఆర్ కు సంజయ్ లేఖ ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. వడ్లు కొనిపించే భాధ్యత నాదేనన్న బండి మొహం చాటేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లు కోనుగోలు చేశారని చెప్పారు. రైతుబంధుకు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి చాలా తేడా ఉందని మంత్రి పేర్కొన్నారు. రూ.7,500 కోట్లకు, రూ.500 కోట్లకు తేడా తెలుసుకోవాలని బండికి నిరంజన్ రెడ్డి సూచించారు. “సిఎం కెసిఆర్ కు లేఖ రాసే బదులు 30,000 కోట్లపై చిలుకు కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలి” అని మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.