హైదరాబాద్: వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డిజిపి కార్యాలయం నుండి డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విత్తనాల లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 450 గ్రాముల పత్తి ప్యాకెట్ గరిష్ఠ ధర రూ.767 దాటోద్దన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన ధరకు మించి విక్రయించిన, నకిలీ విత్తనాలు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పిడి యాక్ట్ కేసులు నమోదుచేస్తామన్నారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, తిరస్కరించిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటమని చెప్పారు. వానాకాలంలో గ్లైఫోసైట్ విక్రయాలపై నిషేధం విధించబడిందని, నిషేధిత గ్లైఫోసైట్ అమ్మితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి పోలీసు, వ్యవసాయాధికారుల్ని ఆదేశించారు. ఈ వానాకాలం 70 లక్షల ఎకరాలు సాగులక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు.