Friday, January 17, 2025

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ మోడల్ ఇళ్ళ నిర్మాణం పూర్తి:మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 580 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్‌లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలు యాప్‌లో నమోదు
ఈనెలాఖారులోగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాల సేకరణ పూర్తి
రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే లక్ష్యం

వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో 580 ఇందిరమ్మ మోడల్ ఇళ్ళ నిర్మాణం పూర్తి అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.5 లక్షల అంచనా విలువతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం నమూనాల నిర్మాణం కోసం మొదట డోర్నకల్ నియోజకవర్గంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శంకుస్థాపన చేశామని, ఇపుడు కూసుమంచి తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మరో నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు.

మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ధరతో నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి వారి స్థలాలలో నిర్మించుకోవాలని సూచించారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నెరవేర్చేందుకు ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో అర్హులైన దరఖాస్తులను ఎంపిక చేసి మొదటీ విడత ప్రభుత్వం మంజూరు చేసే నాలుగున్నర లక్షల ఇండ్ల కింద ఎంపిక చేస్తామని అన్నారు. 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వివరాలు సేకరణ జరిగిందని, ఈనెలాఖరు వరకు ప్రతి దరఖాస్తుదారుని వివరాలు సేకరణ పూర్తవుతుందని అన్నారు.

గతంలో దరఖాస్తు చేసుకొనని కుటుంబాలు ఉంటే ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు సమర్పించవచ్చని, గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజాప్రభుత్వానికి లేదని, రాబోయే నాలుగేళ్ల 20 లక్షల ఇండ్లు తగ్గకుండా నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ప్రతి దశలో ఇంటి నిర్మాణ పురోగతి వివరాలు ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో నమోదు చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల డెమో యూనిట్ నిర్మిస్తున్నందున చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా 3 లక్షల 57 వేల 869 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్జీలు పెట్టుకున్నారని, 16 శాతం మేర ఈ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మాజీ ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ,

నేలకొండపల్లి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్లు సీతారాములు, హరినాథ బాబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్‌డిఒ నర్సింహారావు, మండల ప్రత్యేక అధికారిణి శ్రీలత, హౌసింగ్ ఇఇ శ్రీనివాసరావు, పిఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, కూసుమంచి మండల ఇన్‌ఛార్జి తహసీల్దార్ కరుణశ్రీ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News