హైదరాబాద్: ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామసభల ద్వారా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. అర్హత ఉన్నవారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని పొంగులేటి సూచించారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రశీదు ఇస్తారన్నారు. ఇందిరమ్మ పాలనలో ఇంటి వద్దకే అధికారులు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామసభల్లో వచ్చే వారి నుంచి చిత్తశుద్ధి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. గ్రామసభలకు వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు కావాల్సిన నిధులను సిఎం రేవంత్ విడుదల చేశారని పొంగులేటి వెల్లడించారు. గతంలో 33 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రస్తుతం 58 శాతానికి పైగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని లెక్క చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో నివసించేవారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్న అధికారులు వెళ్లాలని సిఎం ఆదేశించారు.