Monday, April 28, 2025

నాటి ‘ధరణి’తో రైతుకు కష్టాలు..నేటి ‘భూ భారతి’తో సుఖాలు

- Advertisement -
- Advertisement -

ఆనాటి ధరణితో రైతులకు ఏర్పడిన కష్టాలకు ఈనాటి భూ భారతితో సుఖాలు చేకూరుతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం – 2025లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా అన్నదమ్ములుగా, అక్కాచెల్లెళ్లుగా జీవిస్తుంటే మాయదారి ధరణి వచ్చిన వారు శత్రువులుగా చేసుకునే విధంగా ఆనాటి చట్టంలో లొసుగులు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు, కష్టాలు పడ్డ మాట వాస్తవం అని అన్నారు. దాని వల్ల గత ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ప్రజల సమస్యల పరిష్కారానికి, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే నిజమైన చట్టాన్ని భూ భారతిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశామని అన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 లక్షల 45 వేల దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. భూ సమస్యల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా తహశీల్దార్లు ప్రతి గ్రామంలో రెవెన్యూ సభలు నిర్వహించడం ద్వారా దరఖాస్తులను సేకరించి వాటి పరిష్కరిస్తారని అన్నారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పరిష్కారాలు చూపుతామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మే రెండవ తేదీ నుండి హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాతనగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని అన్నారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం వలన తరతరాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అన్నారు. గిరిజన ప్రాంతంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కమిటీ గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్‌పి రోహిత్ రాజ్, తెలుపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్‌డిఒ మధు, హౌసింగ్ పిడి శంకర్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News