బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ వ్యవహారం కుంభకర్ణుడు సుధీర్ఘ నిద్రలేచి పెడబొబ్బలు పెట్టినట్లుగా ఉందని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులు విమర్శించారు. ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, నేనున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ చోట్ల జరిగిన విలేకరుల సమావేశాల్లో భాగంగా కెసిఆర్ వైఖరిని వారు దుయ్యబట్టారు. ఈ ఏడాది కాలంలో నల్గొండ, కరీంనగర్ బిఆర్ఎస్ సభల్లో కూడా కెసిఆర్ గాంభీర్య ప్రకటనలే చేశారని, ఆ తర్వాత ఏమయ్యారో అందరికీ తెలిసిందేనని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, నేనున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొరగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. పథకాలు అమలు కాలేదని ఫాంహౌజ్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.
ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి పదే పదే ఆహ్వానించారని, 80 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరినా ఎందుకు రాలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. భూ భారతి చట్టం ప్రవేశ పెట్టినప్పుడైనా అస్సెంబ్లీకి వస్తారని ఆశించామని ఆయన మంత్రి పొంగులేటి తెలిపారు. కెసిఆర్ ఫాంహౌస్‌లో ఉండి కలలు కనడం మానుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కెసిఆర్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కెసిఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
రేవంత్ దెబ్బకు ఫాంహౌస్‌లో పడ్డారు : శ్రీనివాస్
సిఎం రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు కెసిఆర్ ఫాంహౌస్‌లో పడ్డారని, ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడంతో సిఎంగా రేవంత్ అయ్యారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కెసిఆర్ బయటకు వస్తానంటున్నారన్నారు. కెసిఆర్‌కు ఎన్నికలు తప్ప ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని, ఆయన వైఖరి అందరికీ అర్ధమైందన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే బిఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని ఎంపి మల్లు రవి అన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం సోషల్ మీడియా కాకుండా రాష్ట్ర ప్రజలను నమ్ముకుందని ఈ క్రమంలోనే తాము పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు వెళుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కెసిఆర్ బయటకు రావాలని చూస్తున్నామని, ఆయన బయటకు వస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూద్దామనుకుంటున్నామని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూద్దామని దయాకర్ అన్నారు.
రియల్ ఎస్టేట్ కొంపముంచిన కెసిఆర్ : జగ్గారెడ్డి
14 నెలల తర్వాత ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ బయట ప్రపంచానికి కనిపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్‌ను కొంపముంచింది, నాశనం చేసిందే కెసిఆర్ అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ వల్లే ఎన్నికల ముందే రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు.