భూదాన్, దేవాదాయ, అసైన్డ్
భూముల అక్రమాలను
వెలికితీస్తున్నాం ఫోరెన్సిక్
ఆడిట్‌లో అన్నీ బయటపడతాయి
సియోల్‌లో చెప్పిన కుంభకోణాలు
వెలుగులోకి వస్తున్నాయి
విద్యుత్ కమిషన్ రిపోర్టు
అందింది మీడియాతో
చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ తరువాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్‌ను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 2014 నుంచి 2023 డి సెంబర్ 7 తేదీ వరకు జరిగిన భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, ఈ నెలలోనే ఒకటి లేదా రెండు కంపెనీలకు ఈ ఆడిట్‌ను అప్పగించబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పే ర్కొన్నారు.సచివాలయంలో మంత్రి పొంగులేటి మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భూదాన్, దేవాదాయ, అసైన్డ్ భూము ల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయట పడతాయన్నారు. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుందని ఆయన అన్నారు.
సియోల్ బాంబులు పేలడం మొదలవుతున్నాయని మంత్రి తెలిపారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందని ఆయన అన్నారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా పూర్తి కాలేదని కొనసాగుతుందని ఆయన తెలిపారు. తాను మంత్రి అయ్యాక తమ జిల్లా మాజీ మంత్రి తాను ఎదురుపడలేదు అసలు ఉన్నాడా? లేదా అన్నట్లు ఆ పార్టీ నడుస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. భూ భారతి బిల్లు గవర్నర్ వద్ద ఉందని, గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుందని మంత్రి తెలిపారు. రూల్స్‌ను రూపొందించడానికి రెండు నెలల సమయం పడుతుందని మంత్రి తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో 2వేల ఎకరాలు…
ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న భూముల వివరాలను సరిపోల్చి వాటిని బయటకు తీస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోనే 2 వేల ఎకరాలకు పైగా అక్రమాలు జరిగాయన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1,300 నుంచి 1,400 ఎకరాలను గుర్తించడం జరిగింద న్నారు. సిరిసిల్లలో భూ ఆక్రమణలపై విచారణ కొనసాగుతోందని, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురు ప్రభుత్వ అధికారులపై ఒకటి, రెండు రోజుల్లో కఠిన చర్యలు తీసుకోబోతున్నామని ఆయన తెలిపారు. సిద్ధిపేటలో 484 ఎకరాల ప్రభుత్వ భూమిని, ప్రైవేటు భూమి అని ధారాదత్తం చేశారని, చివరకు బోగస్ కోర్టు జడ్జిమెంటట్‌లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, ఇవన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బహిర్గతం చేస్తామని మంత్రి తెలిపారు.
శాస్త్రీయ పద్ధతిలో విచారణ కొనసాగిస్తాం
తమకు ఎవరిమీద కోపం లేదని, శాస్త్రీయ పద్ధతిలో విచారణ కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పరిపాలన చేయవలసిన వారే దానిని భక్షిస్తే, ఎవరూ దొరికినంత వారు దోచుకుంటారని, గత పదేళ్లలో జరిగింది ఇదేనని ఆయన అన్నారు. ప్రతి మండల కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేస్తామని ఆయన తెలిపారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, తప్పు, ఒప్పులు తేల్చేది కోర్టులని ఆయన అన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదన్నారు. తమకు బిఆర్‌ఎస్ నాయకులు టార్గెట్ కాదని, తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదన్నారు. కెటిఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
కొత్త సంవత్సరంలో కెటిఆర్‌లో స్పిరిట్ పెరిగింది
కెటిఆర్ మారలేదు ఆయన రైటర్ మారినట్లుందన్నారు. కొత్త సంవత్సరంలో కెటిఆర్‌లో స్పిరిట్ పెరిగిందన్నారు. కాంగ్రెస్‌కు బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ చెప్పాలని ఆయన సూచించారు. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్లాయో తేలాలన్నారు. ప్రాంతీయ పార్టీల్లో డబ్బులున్న పార్టీ బిఆర్‌ఎస్ అని, అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కెసిఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ అక్కడ ఉంటారని, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలని కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదన్నారు. ఏదీ బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుంద న్నారు. ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్‌లు బిఆర్‌ఎస్ వాళ్లు అడిగితేనే వేశామని ఆయన తెలిపారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములా పై విచారణ వారే అడిగారని, కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదని ఆయన అన్నారు. సిస్టంలో వాళ్లు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయని మంత్రి తెలిపారు.
కెటిఆర్ కంటే ముందు కవిత జైలుకు వెళ్లారు…..
జైలుకు వెళితేనే సిఎం అవుతాననుకుంటే కెటిఆర్ కంటే ముందు కవిత ఉన్నారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదని, అర్వింద్‌కుమార్ నిజాలు చెబితే అన్ని బయటకు వస్తాయన్నారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు.