Tuesday, April 29, 2025

అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలే:మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

అధికారం కోల్పోయినా కెసిఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని, కడుపు నిండా విషం నింపుకొని..మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం, శాకారం టిజిఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయనతోపాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన దేవత సోనియా గాంధీకి సాష్టాంగ ప్రణామం చేసిన కెసిఆర్.. కాలం తిరగబడి ప్రజలు బుద్ధి చెప్పడంతో కాంగ్రెస్‌ను విలన్‌గా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను నిండా ముంచిన కెసిఆర్ కనీసం గ్రామస్థాయి సర్పంచులకు కూడా బిల్లు ఇవ్వకపోగా, తప్పును తమపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో నియంతలా వ్యవహరించిన కెసిఆర్ సొంత పార్టీ ఎంఎల్‌ఎలను కూడా కలిసేందుకు ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఇపుడు తగుదునమ్మా అంటూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేందుకే తాము భూ భారతి చట్టం తీసుకువచ్చామని, తమ అక్రమాలు బయటపడతాయనే బిఆర్‌ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. తాము రైతులకురూ.2 లక్షల రుణమాఫీ చేసినందుకా, మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నందుకా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నందుకా, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా, మీ ఏడుపులు, పెడబొబ్బలు అంటూ కెసిఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, గజ్వేల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ మనూ చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూoకుంట నర్సారెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, నాయకుడు భూమ్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీ ఛైర్మన్లు నరేందర్ రెడ్డి, విజయ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌డిఓ చంద్రకళ, తహసిల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News