రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూభారతి -2025 చట్టాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారని, కానీ, ప్రతిపక్షాలు విమర్శించడం విచారకరమన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)ఆధ్వర్యంలో రూపొందించన రెవెన్యూ డైరీ -2025, క్యాలండర్‌ను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. సంక్రాంతిలోపు తహసీల్దార్ల బదిలీలను (గతంలో ఎన్నికలకు ముందు బదిలీ అయిన) ప్రక్రియ పూర్తి చేస్తామని, సంబధిత దస్త్రాన్ని పంపించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఆమోదించినప్పటికి సమయ భావం వల్ల గత కేబినెట్‌లో నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థకు, 33 మంది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆమోదం పొందలేకపోయిందని, వచ్చే కేబినెట్‌లో దానిని తప్పనిసరిగా ఆమోదింపచేస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యోగులంతా నిజాయితీగా పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 317 జీఓతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, అలాగే సాధారణ బదిలీల్లో డిప్యూటీ తహసీల్దార్లను, సీనియర్ అసిస్టెంట్‌లను, సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని వారిని సొంత జిల్లాలకు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్ ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు, పడిగెల రాజ్‌కుమార్, ఎండి రియాజుద్దీన్, కోశాధికారి బి.వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు కె.నిరంజన్ రావు, నాగమణి, కో ఆర్డినేటర్ నారాయణ రెడ్డి, కార్యదర్శులు మనోహర్ చక్రవర్తి, టి.వాణి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు జగన్‌మోహన్ రెడ్డి, శ్రవణ్, వాణి, సునీల్ రెడ్డి, రమన్ రెడ్డి, రాజకుమార్, కృష్ణయ్య, సుధాకర్‌లు పాల్గొన్నారు.