Wednesday, April 30, 2025

దేశానికి రోల్ మోడల్‌గా భూ భారతి:మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

దేశానికి రోల్ మోడల్‌గా భూ భారతి నిలుస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూ భారతి 2025 చట్టంపై మంగళవారం వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కార మార్గం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందని అన్నారు. ఈ చట్టం రైతులకు శ్రీరామరక్ష అని అన్నారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం భూ భారతి చట్టంపై ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించి అందులోని అంశాలను జిల్లా కలెక్టర్ వివరించారు.

అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ధరణి వల్ల రైతుల వారసత్వంగా వచ్చే భూమిని అనుభవించలేక అనేక సమస్యలు ఏర్పడ్డాయని, వాటి చిక్కుముడి విప్పడానికే భూ భారతి దోహదపడుతుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచల వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. సభలో రైతులు కొంగరి భాస్కరరావు, విజయ్ కుమార్, గోపాల రాధాకృష్ణ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ప్రజలకు అందినప్పుడు దానికి సార్ధకత చేకూరుతుందని, అందుకు అధికారులు నిబద్దతతో పనిచేయాలన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూముల సర్వే, మ్యాప్ తయారీ , పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు నిజాయితీగా పనిచేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో మంత్రుల భోజనం
వరంగల్ నగర పరిధిలోని 32వ డివిజన్ బిఆర్‌నగర్‌లో మంగళవారం సన్నబియ్యం లబ్ధిదారుడు సింగబోయిన అనిల్ కుమార్ ఎల్లమ్మ ఇంట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంఎల్‌ఎ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ అశ్విని థానాజీ వాకడే భోజనం చేశారు. లబ్ధిదారులు అందించిన ఆతిధ్యానికి ముగ్ధులైన మంత్రులు అన్నదాత సుఖీభవ అంటూ కుటుంబ సభ్యులను శాలువతో సత్కరించి, నజరానా అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News